ప్లాస్టిక్‌పై బ్యాన్‌.. ఒక్కరోజే 3.5 లక్షల రూపాయలు

25 Jun, 2018 17:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ముంబై : పర్యావరణ పరిరక్షణలో భాగంగా బ్రిహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) శనివారం(జూన్‌ 23) నుంచి ప్లాస్టిక్‌పై నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్‌ కవర్లు వాడే రీటైలర్స్‌, షాపు ఓనర్లపై కొరడా ఝలిపించింది. దీంతో ఆదివారం ఒక్కరోజే 87 షాపుల నుంచి 3.5 లక్షల రూపాయలు జరిమానా రూపంలో ఖజానాకు జమ అయింది. అయితే బీఎంసీ తీరుతో తమకు నష్టాలు వస్తున్నాయంటూ రీటైలర్‌ అసోసియేషన్‌ సమ్మె చేసేందుకు సిద్ధమైంది.

రీటైలర్‌ వ్యాపారుల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు వీరేశ్‌ షా మాట్లాడుతూ... ‘ప్లాస్టిక్‌ నిషేధం వల్ల కూరగాయల వ్యాపారులకు, స్వీట్‌ షాపు ఓనర్లకు నష్టాలు వస్తున్నాయంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. కూరగాయలు, స్వీట్లు నిల్వ చేయాలన్నా, కస్టమర్లకు అందించాలన్నా ప్లాస్టిక్‌ కవర్లు తప్పనిసరిగా అవసరమవుతాయి. ఇలాంటి సీజన్‌ టైమ్‌లో బీఎంసీ తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది చిరు వ్యాపారులు ఎంతగానో నష్టపోతున్నారు. కాబట్టి సీజన్‌(వర్షాకాలం) అయిపోయేంత వరకైనా ప్లాస్టిక్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నామ’ని వ్యాఖ్యానించారు. పాల వ్యాపారులకు ఉన్నవిధంగానే కూరగాయల వ్యాపారులకు కూడా ప్యాకేజింగ్‌ విధానానికి అనుమతినివ్వాలని బీఎంసీకి విఙ్ఞప్తి చేశామన్నారు. తమ సమస్యలను వివరిస్తూ బీఎంసీకి లేఖ రాసినప్పటికీ వారి నుంచి ఎటువంటి హామీ రాలేదని.. అందుకే బుధవారం నుంచి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. బ్రాండెడ్‌ వస్తువుల కోసం ఉపయోగించే మల్టీ లేయర్డ్‌ ప్లాస్టిక్‌ను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చే మీరు.. రీసైక్లింగ్‌ ప్లాస్టిక్‌ వాడేందుకు చిరు వ్యాపారులకు అనుమతి నిరాకరించడం న్యాయమేనా అంటూ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు