శవాలకోసం వెళితే మళ్లీ కాల్పులు జరిపారు

12 Apr, 2015 16:43 IST|Sakshi
కాంచన్లాల్లోని ఆసుపత్రి ప్రాంగణంలో గాయపడ్డ జవాన్లు చికిత్స పొందుతున్న దృశ్యం (ఫైల్)

ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని దోర్నపాల్- చింతగుఫా వద్ద జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన ఎస్టీఎఫ్ జవాన్ల మృతదేహాలను సీఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనపర్చుకుని, బేస్ క్యాంప్నకు తరలించాయి. ఎన్కౌంటర్ జరిగిన 24 గంటల తర్వాతగానీ మృతదేహాల తరలింపు సాధ్యపడకపోవడానికి గల కారణాలను ఏడీజీపీ ఆర్ కే విజ్ మీడియాకు వివరించారు.

చనిపోయిన జవాన్ల శవాలకోసం ఘటనా స్థలానికి వెళ్లిన సీఆర్పీఎఫ్ బృందంపై అనూహ్యరితీలో మావోయిస్టులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. దీంతో  భద్రతా దళం వెనక్కి వచ్చేసింది. ఆదివారం ఉదయం మరింత బలగంతో వెళితేగానీ శవాల స్వాధీనం సాధ్యపడలేదని విజ్ చెప్పారు. కూంబింగ్ అనంతరం శనివారం మద్యాహ్నం బేస్ క్యాంపునకు తిరిగివస్తున్న ఛత్తీస్గఢ్ పోలీస్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) జవాన్లను  దాదాపు 200 మంది నకల్స్ చుట్టుముట్టారు. ఇది గమనించిన జవాన్లు ఫైర్ ఓపెన్ చేశారు. అటు మావోయిస్టులు కూడా కాల్పులు ప్రారంభించడంతో రెండు గంటపాటు ఆ ప్రాంతమంతా తుపాకుల చప్పుళ్లతో మారుమోగింది.

 

ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు మృతిచెందగా 11 మంది గాయాలతో బయటపడ్డారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపునకు కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థగానీ,  బ్యాక్ అప్ ఫోర్స్ గానీ లేకపోవడంతో బుల్లెట్ దెబ్బలుతిన్న జవాన్లు ఊసురోమంటూ సీఆర్పీఎఫ్ క్యాంప్ను చేరుకున్నాకగానీ ఎన్కౌంటర్ గురించి బయటి ప్రపంచానికి తెలియలేదు!

 

ఎన్ కౌంటర్ లో ఎస్టీఎఫ్ ప్లటూన్ కమాండర్ శంకర్ రావుతో పాటు ఏడుగురు జవాన్లు మరణించారు. ప్రస్తుతం మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గాయపడినవారికి కాంచన్లాల్లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 2013లో కాంగ్రెస్ నేతలపై దాడి తరువాత మావోయిస్టులు.. పోలీసులను ఎన్కౌంటర్ చేయడం ఇదే ప్రథమం

మరిన్ని వార్తలు