నేలకు దిగిన బోయింగ్‌లు

14 Mar, 2019 05:04 IST|Sakshi

భారత్‌లో మ్యాక్స్‌–8 రకం విమానాలపై నిషేధం అమల్లోకి

యూరప్‌కు ‘ఇథియోపియా’ బ్లాక్‌బాక్స్‌

న్యూఢిల్లీ/అడిస్‌ అబబా: భారత విమానయాన సంస్థలు ఉపయోగిస్తున్న అన్ని బోయింగ్‌ 737 మ్యాక్స్‌–8 రకం విమానాలను కిందకు దింపేశామని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఖరోలా బుధవారం చెప్పారు. దీని కారణంగా స్పైస్‌జెట్‌కు చెందిన 35 విమానాల సర్వీసులు గురువారం రద్దు అవుతాయన్నారు. రద్దవుతున్న సర్వీసులకు టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు తమ ఇతర విమానాల్లో టికెట్లు కేటాయిస్తున్నామనీ, టికెట్లు రద్దయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని స్పైస్‌జెట్‌ తెలిపింది.

వివిధ దర్యాప్తు సంస్థల నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి బోయింగ్‌పై నిషేధాన్ని కొనసాగించాలా, ఎత్తేయాలా అన్నది నిర్ణయిస్తామనీ, అయితే దీనిపై సమీప భవిష్యత్తులో నిర్ణయం వెలువడే అవకాశం లేదని ఆయన అన్నారు. ఇక మరో భారతీయ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ వద్ద కూడా ఐదు బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 8 రకం విమానాలు ఉన్నప్పటికీ వాటికి అద్దె చెల్లించలేక ఆ సంస్థ వాటిని ఇప్పటికే నిలిపేసింది. తాజా నిషేధంతో ఆ సంస్థ సర్వీసులపై ప్రభావమేమీ ఉండదు.

ఇథియోపియాలో ఇటీవల కూలిపోయిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 8 విమానంలోని బ్లాక్‌ బాక్స్‌లను విశ్లేషణల కోసం యూరప్‌కు పంపనున్నట్లు ఇథియోపియా ప్రభుత్వం తెలిపింది. బోయింగ్‌ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై ఆందోళనలు నెలకొన్న తరుణంలో ఈ బ్లాక్‌ బాక్స్‌లను విశ్లేషించాలని తీవ్రంగా ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఇథియోపియా ఈ నిర్ణయం తీసుకుంది.  బోయింగ్‌ విమానాలపై అనేక దేశాలు నిషేధం విధించాయి. ఇథియోపియాలో కూలిన విమానం బ్లాక్‌ బాక్స్‌లు, కాక్‌పిట్‌ల్లోని సమాచారాన్ని విశ్లేషించేందుకు అవసరమైన పరికరాలు తమ వద్ద లేవనీ, కాబట్టి వాటిని యూరప్‌కు పంపుతున్నామని ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి చెప్పారు. అయితే యూరప్‌లో ఏ దేశానికి పంపాలో గురువారం నిర్ణయిస్తామన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా