ట్వీట్‌ కొట్టు.. క్యాష్‌ పట్టు

20 Feb, 2019 00:42 IST|Sakshi

రాజకీయ పార్టీలకు సెలబ్రిటీల రహస్య ప్రచారం

ఒప్పందం కుదుర్చుకునేందుకు వచ్చి దొరికిపోయిన 36 మంది  

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ డబ్బులు తీసుకుని రాజకీయ పార్టీలకు అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేస్తామని ఒప్పుకుని 36 మంది బాలీవుడ్‌ సెలబ్రిటీలు స్టింగ్‌ ఆపరేషన్‌లో దొరికిపోయారు. వార్తల వెబ్‌సైట్‌ కోబ్రాపోస్ట్‌ పక్కాగా ప్రణాళిక రచించి ఈ రహస్య ఆపరేషన్‌ను నిర్వహించగా, 36 మంది ప్రముఖుల గుట్టు రట్టయ్యింది. ఆ 36 మందిలో జాకీ ష్రాఫ్, సోనూ సూద్, వివేక్‌ ఒబెరాయ్, సన్నీ లియోనీ తదితర ప్రముఖులున్నారు. విద్యా బాలన్, అర్షద్‌ వార్సీ, సౌమ్య టాండన్, రజా మురాద్‌ వంటి అతి కొద్ది మంది సెలబ్రిటీలు మాత్రం తమ అంతరాత్మకు వ్యతిరేకంగా తాము ఈ పనిచేయలేమంటూ పక్కకు తప్పుకున్నారు. వివరాలను కోబ్రాపోస్ట్‌ ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌ అనిరుద్ధ్‌ బహల్‌ మంగళవారం వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కోబ్రాపోస్ట్‌ ట్విట్టర్‌లోనూ పోస్ట్‌ చేసింది. అనిరుద్ధ చెప్పినదాని ప్రకారం.. కోబ్రాపోస్ట్‌ రిపోర్టర్లు ఒక ప్రజాసంబంధాల కంపెనీ ప్రతినిధులుగా నటిస్తూ ఆయా సెలబ్రిటీలను వారి మేనేజర్ల ద్వారా సంప్రదించారు.

తమకు రాజకీయ పార్టీలతో ఒప్పందాలు ఉన్నాయనీ, ఆ పార్టీలకు ప్రచారం కల్పించేందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగాం తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేస్తే డబ్బిస్తాం అంటూ సెలబ్రిటీలకు రిపోర్టర్లు చెప్పారు. పోస్ట్‌ల్లో ఉండాల్సిన సమాచారాన్ని తమ కంపెనీ సిబ్బంది పంపుతారనీ, ఆ సమాచారాన్ని సెలబ్రిటీలు తమ సొంత అభిప్రాయాలుగా తమ ఖాతాల్లో పోస్ట్‌ చేస్తే చాలు, డబ్బులిస్తామంటూ రిపోర్టర్లు ఆ 36 మందితో చెప్పారు. అత్యాచార కేసులు, వంతెనలు కూలడం వంటి ప్రమాద ఘటనల్లో ప్రభుత్వాన్ని వెనకేసుకొసుకు రావడం కూడా ఈ పోస్ట్‌ల్లో ఉంటాయని స్పష్టంగా చెప్పారు. ఇదంతా తమకు సమ్మతమేననీ, పోస్ట్‌లు, ట్వీట్‌లు చేస్తామంటూ రిపోర్టర్లతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సెలబ్రిటీలు ముందుకొచ్చారు. ఆ 36 మంది సెలబ్రిటీల్లో ఎక్కువగా మధ్యస్థాయి ప్రాచుర్యం కలిగిన నటీనటులు, గాయకులు, నృత్యకారులు తదితరులున్నారు. వారి పాపులారిటీని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ట్వీట్‌ లేదా పోస్ట్‌కు రూ. 2 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు డిమాండ్‌ చేశారు. మొత్తం 8 నెలల కాలంపొటు ఉండే ఒప్పందానికి రూ. 20 కోట్లు ఇవ్వాలని కూడా కొందరు కోరారు.
 
నల్లధనం తీసుకునేందుకే మొగ్గు 
ప్రజా సంబంధాల కంపెనీ ప్రతినిధుల ముసుగులో ఉన్న రిపోర్టర్లకు తమ పాన్, బ్యాంకు ఖాతా నంబర్లను కూడా చెప్పేందుకు సెలబ్రిటీలు సిద్ధమయ్యారని అనిరుద్ధ చెప్పారు. ఈ డబ్బులో చాలా వరకు నల్లధనంగా, నగదు రూపంలోనే అందుతుందని చెప్పినా దాదాపు అందరూ అందుకు అంగీకరించారన్నారు. అయితే సోనూసూద్‌ ఓ ప్రకటన విడుదల చేస్తూ వీడియోలను కోబ్రాపోస్ట్‌ పూర్తిగా కాకుండా ఎడిట్‌ చేసి బయటకు వదిలిందనీ, తాను మాట్లాడిన వాటిలో కొన్ని మాటలను మాత్రమే బయటపెట్టి తనపై వ్యతిరేక భావమే వచ్చేలా ఆ వీడియోలను తయారు చేసిందని ఆరోపించారు. 

వీరే ఆ సెలబ్రిటీలు 
కోబ్రా పోస్ట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం జాకీ ష్రాఫ్, వివేక్‌ ఒబెరాయ్, సన్నీ లియోనీ, అమీషా పటేల్, టిస్కా చోప్రా, రాఖీ సావంత్, సోనూ సూద్, కైలాష్‌ ఖేర్, బాబా సెహ్‌గల్, శ్రేయాస్‌ తల్పాడే, శక్తి కపూర్, పంకజ్‌ ధీర్, నిఖితిన్‌ ధీర్, పునీత్‌ ఇస్సార్, రాజ్‌పాల్‌ యాద వ్, మినిషా లాంబా, మహిమ చౌధరి, రోహిత్‌ రాయ్, అమన్‌ వర్మ, కొయెనా మిత్ర, రాహుల్‌ భట్, దలేర్‌ మెహందీ, మికా, అభిజీత్‌ భట్టాచార్య, గణేష్‌ ఆచార్య, రాజు శ్రీవాస్తవ, కృష్ణ అభిషేక్, విజయ్‌ ఈశ్వర్లాల్‌ పవార్‌ (వీఐసీ) తదితరులు పోస్ట్‌లు చేసేందుకు డబ్బులు తీసుకునే ఈ ఒప్పందానికి అంగీకరించారు. 

మరిన్ని వార్తలు