వీర సైనికులకు సినీ ప్రముఖుల సలాం

19 Sep, 2016 15:11 IST|Sakshi
వీర సైనికులకు సినీ ప్రముఖుల సలాం

ముంబై: జమ్మూకశ్మీర్ లోని యూరి పట్టణంలో విదేశీ ఉగ్రమూకలు సాగించిన మారణకాండ జాతియావత్తను నివ్వెరపరించింది. సైనిక స్థావరాలను లక్ష్యంగా ముష్కరులు చేసిన దాడిలో 20 మంది సైనికులు వీరమరణం పొందారు. మారణహోమం సృష్టించిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఉగ్రదాడిని జాతియావత్తు ముక్తకంఠంతో ఖండించింది. బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ కిరాతక దాడిని తీవ్రంగా ఖండించారు. అమరజవానులకు జోహార్లు అర్పించారు. తమ సందేశాలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

బాధతో పాటు కోపం కూడా వస్తోందని సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యానించారు. ఎటువంటి కవ్వింపు లేకుండగానే మన సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందన్నారు. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతుందున్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘యూరి సైనిక స్థావరంపై దాడి పిరికిపందల చర్య. అమరవీరుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను త్వరలోనే శిక్షిస్తారని ఆశిస్తున్నాన’ని షారూఖ్ ఖాన్ ట్వీట్ చేశాడు. మాతృభూమి కోసం పోరాడుతూ ప్రాణాలు వదిలిన అమర జవాన్లకు రితేశ్ దేశ్ముఖ్ ప్రగాఢ సంపతాపం ప్రకటించాడు.

‘స్వర్గం మండింది. కశ్మీర్ గుండె పగిలింది. సుందర పట్టణం యూరిపై ఉగ్రదాడి కలచివేసింద’ని దర్శకుడు శేఖర్ కపూర్ ట్వీట్ చేశారు. ఉగ్రవాదుల దాడిలో అమరులైన సిపాయిల ఆత్మకు శాంతి కలగాలని రేణుకా సహాని ప్రార్థించారు. యూరిలో ఉగ్రదాడిని తనను ఎంతోగానే కలచివేసిందని అలియా భట్ పేర్కొంది. పిరికి పందలకు మన సైనికులకు గట్టి హెచ్చరిక జారీ చేసినట్టయిందని బాబీ డియోల్ అన్నాడు. మధు భండార్కర్, అద్నాన్ సమీ, ఈషా గుప్తా, అనుష్క శర్మ, అమీషా పటేల్, నేహా శర్మ, రణదీప్ హుడా తదితరులు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు