‘యూనియన్‌ లీడర్‌’ వస్తున్నారు

6 Jan, 2018 19:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌లోని ఓ రసాయనిక ఫ్యాక్టరీలో కార్మికులు ఎదుర్కొంటున్న ప్రాణాంతకమైన పరిస్థితులను కళ్లకు కట్టేలా చూపించడానికి ‘యూనియన్‌ లీడర్‌’ అనే బాలీవుడ్‌ సినిమా మన ముందుకు వస్తోంది. గుజరాత్‌లో ఏడేళ్లు, ఆ తర్వాత కెనడాలో కెమికల్‌ ఇంజనీర్‌గా పనిచేసిన సంజయ్‌ పటేల్‌ ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఇదే ఆయన మొదటి చిత్రం. యూనియన్‌ నాయకుడుగా రాహుల్‌ భట్, ముఖ్యపాత్రలో తిలోత్తమ షోమ్‌ నటించిన ఈ చిత్రం జనవరి 21వ తేదీన దేశవ్యాప్తంగా విడుదలవుతోంది.

అప్పుడప్పుడు రక్తం కక్కుకుంటూ బాధ పడుతున్న ఓ రసాయనిక ఫ్యాక్టరీ కార్మికులు తమకు సరైన భద్రతా పరిస్థితులను కల్పించడంతోపాటు ఇతర హక్కుల కోసం పోరాటం చేయడమే ఇతివత్తంగా ఈ సినిమాను తెరకెక్కించానని పటేల్‌ తెలిపారు. ఇది కల్పిత గాథే అయినప్పటికీ తాను ఇంజనీరుగా పనిచేసిన కాలంలో ఫ్యాక్టరీలలో ఎదురైన అనుభవాలను మిలితం చేసి ఇందులో చూపించేందుకు ప్రయత్నించానని ఆయన చెప్పారు.

నాడు తాను యాజమాన్యం తరఫున ఇంజనీరుగా పనిచేసినప్పటికీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు స్పందించానని, వాటిని యజామన్యం దష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించానని, అప్పటికీ ఇప్పటికీ గుజరాత్‌ రసాయనిక ఫ్యాక్టరీల్లో పరిస్థితులు మారలేదని, అందుకనే అలాంటి యజమాన్యాలకు కనువిప్పు కలిగించే అంశాలతో ఈ సినిమాను పూర్తి చేశానని ఆయన చెప్పారు. రసాయన ఫ్యాక్టరీల్లో వెలువడే ప్రమాదకర వాయువుల వల్ల వచ్చే క్యాన్సర్‌తో ఏటా దేశంలో పది లక్షల మంది మరణిస్తున్నారన్నది వైద్యుల అంచనా.

మరిన్ని వార్తలు