‘దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది’

5 Aug, 2019 16:53 IST|Sakshi

ముంబై: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని బాలీవుడ్‌ స్వాగతించింది. సాహాసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలపై బాలీవుడ్‌ ప్రముఖులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. మోదీ సర్కారు నిర్ణయానికి మద్దతుగా సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.  

తీవ్రవాద నిర్మూలన దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాక నిర్ణయంగా ఆర్టికల్‌ 370 రద్దును హీరోయిన్‌ కంగనా రౌనత్‌ పేర్కొన్నారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే తీసుకోగలరని ప్రశంసించారు. ఆయన దార్శనికుడు మాత్రమే కాదని, చాలా ధైర్యవంతుడైన నాయకుడని కొనియాడారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల శక్తివంతుడని పొగడ్తలతో ముంచెత్తారు. జమ్మూ కశ్మీర్‌కు మంచి భవిష్యత్తు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.

కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం మొదలయిందని సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ట్వీట్‌ చేశారు. జమ్మూ కశ్మీర్‌లో శాంతి నెలకొనాలని నటి దియా మిర్జా ఆకాంక్షించారు. జమ్మూ కశ్మీర్‌లో అందరూ క్షేమంగా ఉండాలని నటుడు సంజయ్‌ సూరి కోరుకున్నారు. కేంద్రం నిర్ణయానికి మద్దతుగా రవీనా టాండన్‌ జాతీయ పతకాలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. జైరా వసీం, విక్రాంత్‌ మాసే, మాన్వి గాగ్రు తదితరులు కేంద్రం నిర్ణయంపై హర్షం వెలిబుచ్చారు.

‘మన మాతృభూమికి ఈరోజే నిజమైన పరిపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధించింది. ఇండియా అంతా ఒకటే అనేది నేడు సాకారమైంది. జై హింద్‌​’ అంటూ విలక్షణ నటుడు పరేశ్‌ రావల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370 రద్దును విప్లవాత్మక నిర్ణయంగా నిర్మాత ఏక్తాకపూర్‌ వర్ణించారు. కేంద్రం నిర్ణయంతో కశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. యునైటైడ్‌ ఇండియా కల సాకారం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు ఇది ఘనమైన నివాళిగా హీరో వివేక్‌ ఒబరాయ్‌ పేర్కొన్నారు. ప్రతి దేశభక్తుడు మోదీ, అమిత్‌ షాలకు కృతజ్ఞతలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. (చదవండి: ఆర్టికల్‌ 35ఏ కూడా రద్దైందా?)

మరిన్ని వార్తలు