కుమార్తెలపై అత్యాచారం.. తల్లి మద్దతు.. బెయిల్‌ నిరాకరణ

11 Jul, 2020 16:45 IST|Sakshi

ముంబై: సభ్య సమాజం సిగ్గుపడాల్సిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వార్త చదివితే ఇలాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టడం కంటే అనాథలుగా బతకడం మేలనిపిస్తుంది. కుమార్తెలపై భర్త ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. తండ్రి దారుణాల గురించి తల్లికి చెబితే.. ఆమె వారిన కొట్టి.. దీని గురించి ఎవరికి చెప్పవద్దని బెదిరించడం నిజంగా దారుణం. ఈ క్రమంలో కేసులో ప్రధాన నిందితురాలైన తల్లికి బాంబే కోర్టు బెయిల్‌ తిరస్కరించింది. జరిగిన దారుణం తమను తీవ్రంగా కలిచి వేసిందని.. నిజంగా ఇది ప్రకృతి విరుద్ధమైన ఘటన అని కోర్టు వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర బీడ్‌ జిల్లాకు చెందిన కాజీ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాలు.. 

హెడ్‌మాస్టర్‌గా పని చేస్తున్న నిందితుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 31న తన 20 ఏళ్ల పెద్ద కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దాంతో మిగతా ఇద్దరు కుమార్తెలు పెద్దగా ఏడుస్తూ గొడవ చేయడం ప్రారంభించారు. తల్లిందండ్రులు వారిని గదిలో వేసి దారుణంగా కొట్టారు. చివరకు ఎలాగో అలా తమ పరిస్థితి గురించి ఓ స్నేహితుడికి సమాచారం అందించారు. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు హెడ్‌మాస్టర్‌ ఇంటికి చేరుకోని బాధితులను విడిపించి కేసు నమోదు చేశారు. ఏళ్లుగా ఆ అమ్మాయిలు అనుభవించిన నరకం గురించి చెప్తుంటే పోలీసులకు కూడా కళ్లు చెమర్చాయి. (అసలు మహారాష్ట్రలో ఏం జరుగుతోంది?)

2012 నుంచి తండ్రి తనపై అత్యాచారం చేయడం ప్రారంభించాడని పెద్ద కుమార్తె పోలీసులకు తెలిపింది. దీని గురించి తల్లికి చెబితే ఆమె తనను తీవ్రంగా కొట్టిందని వెల్లడించింది. అలానే తన 18 ఏళ్ల రెండో చెల్లిపై ఐదో తరగతి చదువుతున్న సమయంలోనే తండ్రి అఘాయిత్యం చేశాడని తెలిపింది. అప్పుడు కూడా ఆ మహాతల్లి తండ్రి దారుణాల గురించి ఎవరికి చెప్పవద్దని పిల్లలను బెదిరించడం గమనార్హం. రెండేళ్ల క్రితం తన మూడో సోదరిపై కూడా తండ్రి అత్యాచారం చేశాడని బాధితురాలు వెల్లడించింది. ఏళ్లుగా తండ్రి చేతుల్లోనే తాము నరకం అనుభవిస్తున్నామని.. తల్లి మౌనంగా చూస్తూ.. అతడికి మద్దతిస్తుందని వారు వాపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు హెడ్‌మాస్టర్‌ దంపతుల మీద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. (కిడ్నాప్‌, ప్రైవేటు భాగాలపై శానిటైజర్‌)

ఈ క్రమంలో బాధితురాలి తల్లి.. పెద్ద కుమార్తె చెడు తిరుగుళ్లు తిరగడంతో తాము మందలించామని.. అందుకే తమ మీద ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తుందని కోర్టుకు తెలిపింది. తనకు బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా కోరింది. ఈ కేసును విచారించిన సింగిల్‌ జడ్జి బెంచ్‌ సదరు మహిళ అభ్యర్థనను తోసి పుచ్చారు. ఆమె ప్రవర్తన ప్రృతికి విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాక ఏ కూమార్తె కూడా తల్లిదండ్రుల గురించి ఇలాంటి ఆరోపణలు, అబద్ధాలు చెప్పదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాక సదరు మహిళ మౌనంగా ఉంటూ భర్త అఘాయిత్యాలకు మద్దతు తెలిపిందని కోర్టు వెల్లడించింది. అంతేకాక పెద్ద కుమార్తె అబద్ధం చెప్తే.. మిగతా ఇద్దరు అందుకు మద్దతు తెలపరని కోర్టు స్పష్టం చేసింది.  

మరిన్ని వార్తలు