సాధ్వి, పురోహిత్‌పై ఉగ్రవాద అభియోగాలు

31 Oct, 2018 01:56 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలోని మాలెగావ్‌లో 2008లో జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితులు లెఫ్టినెంట్‌ కల్నల్‌ ప్రసాద్‌ పురోహిత్, సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్, మరో ఐదుగురిపై మంగళవారం ఉగ్రవాద సంబంధిత అభియోగాలు నమోదయ్యాయి. నవంబర్‌ 2న ఈ కేసులో తుది విచారణ ప్రారంభమవుతుంది. ఉగ్రవాద వ్యాప్తికే నిందితులు అభినవ్‌ భారత్‌ అనే సంస్థను ప్రారంభించారని పేర్కొన్న ప్రత్యేక కోర్టు..వారిపై నేరపూరిత కుట్ర, హత్య తదితర నేరారోపణల్ని కూడా మోపింది.

ఐపీసీ, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఎన్‌ఐఏ కోర్టు జడ్జి వినోద్‌ పాదాల్కర్‌ ఈ మేరకు ఏడుగురిపై అభియోగాలు నమోదుచేశారు. నిందితుల్లో ప్రసాద్‌ పురోహిత్, సాధ్వి ప్రజ్ఞాసింగ్‌తో పాటు మేజర్‌(రిటైర్డ్‌) రమేశ్‌ ఉపాధ్యాయ్, అజయ్‌ రాహిర్కర్, సుధాకర్‌ ద్వివేది, సుధాకర్‌ చతుర్వేది, సమీర్‌ కులకర్ణి ఉన్నారు. జడ్జి ఈ అభియోగాలు నమోదుచేసిన సమయంలో నిందితులంతా కోర్టులోనే ఉన్నారు. వారు దోషులుగా తేలితే జీవితఖైదు లేదా మరణశిక్ష పడుతుంది.

మరిన్ని వార్తలు