ఇక మెట్రో వాత!

24 Jun, 2014 23:25 IST|Sakshi
ఇక మెట్రో వాత!

- ఎమ్మెమ్మార్డీయే పిటిషన్ ను తిరస్కరించిన బాంబే హైకోర్టు
- వ్యయం పెరిగినందున చార్జీల పెంపు సబబేనన్న ధర్మాసనం
- దీంతో ముంబైకర్ల నడ్డి విరిచేందుకు సిద్ధమవుతున్న రిలయన్స్

 సాక్షి, ముంబై: మెట్రోరైలు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ(ఎమ్మెమ్మార్డీయే) దాఖలుచేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. దీంతో మెట్రో చార్జీలు పెంచేందుకు రిలయన్స్ ఇన్‌ఫ్రాకు మార్గం సుగమమైంది. మెట్రో చార్జీలపై ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాన్ని రిలయన్స్ ఉల్లంఘించిందని ఎమ్మెమ్మార్డీయే తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. కాని విపరీతంగా పెరిగిన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని చార్జీలు పెంచడం సమంజసమేనంటూ హై కోర్టు తీర్పునిచ్చింది. ఆ ప్రకారం జూలై ఎనిమిదో తేదీ నుంచి కొత్త చార్జీలు అమలులోకి వస్తాయని మెట్రో అధికార వర్గాలు తెలిపాయి.
 
కేంద్ర ప్రభుత్వం పెంచిన లోకల్ రైలు చార్జీలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. రెట్టింపుగా పెరిగిన చార్జీలను తాము భరించలేమంటూ జనం రోడ్డెక్కుతుంటే మరోవైపు మెట్రో చార్జీల పెంపునకు మార్గం సుగమం కావడం గమనార్హం. రిలయన్స్ ఇన్‌ఫ్రా నిర్ణయం ప్రకారం జూలై ఎనిమిదో తేదీ నుంచి కనీస చార్జీ రూ.10, గరిష్ట చార్జీ రూ.40గా ఉండనుంది. ఈ ప్రకారమే చార్జీలు వసూలు చేస్తామని రిలయన్స్ ఇన్‌ఫ్రా అధికారులు చెబుతున్నారు.
 
మెట్రో చార్జీలపై రాష్ట్ర ప్రభుత్వం, రిలయన్స్ ఇన్‌ఫ్రా మధ్య చాలాకాలంగా వాగ్వాదం జరుగుతోంది. కనీస చార్జీ రూ.9, గరిష్ట చార్జీ రూ.13 చొప్పున వసూలు చేయాలని ప్రభుత్వం అప్పట్లో సూచించింది. కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరగడం, నిర్మాణ వ్యయం తడిసి మోపెడు కావడంతో అప్పట్లో నిర్ణయించిన చార్జీల మేర వసూలు చేస్తే లాభాలమాట అటుంచి నష్టాలు చవిచూడాల్సి వస్తుందని రిలయన్స్ వాదిస్తోంది. కనీస చార్జీ రూ.10, ఆ తరువాత ప్రయాణ దూరాన్ని బట్టి రూ.20, 30, 40 చొప్పున వసూలు చేస్తామంటోంది.

అందుకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ససేమిరా అన్నా రిలయన్స్ తన పట్టును వీడేలా కనిపించలేదు. ప్రారంభోత్సవం వాయిదా పడకుండా అప్పట్లో కొంత వెనక్కు తగ్గినట్లు కనిపించినా కోర్టు తీర్పు నేపథ్యంలో రిలయన్స్ తాను అనుకున్న మేరకే చార్జీలు వసూలు చేసే అవకాశముంద ని చెబుతున్నారు. ఒక నెల రోజుల వరకు కేవలం రూ.10ల నామమాత్ర చార్జీకే వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ ల మధ్య ఎక్కడైనా ప్రయాణించేందుకు అనుమతి కల్పించిన రిలయన్స్ జూలై ఏడు నుంచి చార్జీల మోత మోగిం చనుంది.  
 
మెట్రో చార్జీలు నిర్ణయించండి: హైకోర్టు
ముంబై: ఘాట్కోపర్-వర్సోవా మధ్య ఉన్న 11.4 కి.మీ.ల ముంబై మెట్రో రైల్ కారిడార్‌కు చార్జీలు నిర్ణయించాలని ప్రభుత్వాన్ని మంగళవారం బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ నెలలోనే మెట్రో సేవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎంఎంఓపీఎల్ వసూలుచేస్తున్న మెట్రో చార్జీలను సవాలు చేస్తూ ఎమ్మెమ్మార్డీయే వేసిన పిటిషన్‌ను జస్టిస్ ఆర్.డి. ధనూకా మంగళవారం తిరస్కరించారు.

వచ్చే 9వ తేదీవరకు నిర్దేశిత దూరానికి కనిష్టంగా రూ.10, గరిష్టంగా 40 లు చార్జీ వసూలు చేయాలని ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్(ఎంఎంఓపీఎల్) నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఇతర భాగస్వాములైన ఎమ్మెమ్మార్డీయే   వ్యతిరేకిస్తోంది. ఈ రైల్ కారిడార్‌కు కనిష్టంగా రూ.9, గరిష్టంగా రూ.13 వసూలు చేయాలని ఎంఎంఓపీఎల్ ప్రతిపాదించగా, మెట్రోను నడుపుతున్న ఎంఎంఓపీల్ మాత్రం చార్జీలను రూ.10 నుంచి రూ.40 వరకు వసూలు చేయాలని నిర్ణయించడం గమనార్హం.

ఎమ్మెమ్మార్డీయేకు సంబంధించి .. మెట్రో కారిడార్ చార్జీలను భాగస్వామ్య సంస్థలన్నీ నిర్ణయించాయి కాబట్టి తగిన విధానాన్ని పాటించకుండా ఆర్ ఇన్‌ఫ్రా ఆ చార్జీలను మార్చలేదు. మెట్రో రైలును నడుపుతున్న ఎంఎంఓపీఎల్ విడుదల చేసిన విధివిధానాల చట్టబద్ధత, విలువలపై ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తగిన నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు తెలిపింది. దీని నిమిత్తం మధ్యవర్తులను నియమించుకోవాలని కోర్టు ఆదేశించింది. తమ తరఫున మధ్యవర్తుల పేర్లను సూచించాలని కోర్టు కోరగా భాగస్వామ్య సంస్థలేవీ ముందుకు రాలేదు. కాగా, ఈ మెట్రో ప్రాజెక్టును ప్రజా సంక్షేమం కూడా నిర్మించామని, లాభాపేక్షతో కాదని ఎమ్మెమ్మార్డీయే న్యాయవాది ఈపీ బరూచా వాదించారు.

నామమాత్ర లాభాలపై నడిపే ఉద్దేశంతోనే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టును నిర్మించామని కోర్టుకు విన్నవించారు. చార్జీల నిర్ణాయక కమిటీ సూచనల తర్వాత మాత్రమే చార్జీలను సవరించేందుకు అవకాశముందని ఆయన వాదించారు. దీనిపై  రిలయన్స్ ఇన్‌ఫ్రా ప్రతివాదన చేస్తూ తాము నిర్ణయించిన చార్జీలు బెస్ట్ మున్సిపల్ బస్సులు, ఇతర రైల్వే చార్జీల కన్నా తక్కువగానే ఉన్నాయని పేర్కొంది.

వర్సోవా -ఘాట్కోపర్ మధ్య సాధారణ బస్సు చార్జీ రూ.25 ఉందని, అదే ఏసీ బస్సు అయితే రూ.60 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే ఆటోలో వెళితే రూ.163, ట్యాక్సీలో వెళితే రూ.204 ఖర్చు అవుతుందన్నారు. వీటితో పోలిస్తే తాము వసూలు చేస్తున్న రూ.40 చాలా తక్కువ అని ఆర్ ఇన్‌ఫ్రా తరఫు న్యాయవాది ఇక్బాల్‌చాగ్లా వాదించారు

మరిన్ని వార్తలు