-

చెట్లు నరకడమెందుకు..

13 Nov, 2014 23:22 IST|Sakshi

సాక్షి, ముంబై: కుంభమేళా ఏర్పాట్ల కోసం ఏకంగా 2,400 చెట్లు నరికివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, పర్యావరణ నష్టాన్ని ఎలా పూడుస్తారని ముంబై హైకోర్టు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంసీ) పరిపాలన విభాగాన్ని ప్రశ్నించింది. అందుకు సంబంధించిన స్పష్టమైన నివేదికను త్వరలో అందజేయాలని ఎన్‌ఎంసీని ఆదేశించింది. వచ్చే సంవత్సరం ఆగస్టులో నాసిక్‌లో కుంభమేళా జరగనుంది.

ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి కోటికిపైగా భక్తజనం వస్తారని అంచనావేశారు. అందుకు రోడ్లను వెడల్పు చేయడం, ఇతర సదుపాయాలు కల్పించాలంటే అడ్డువస్తున్న చెట్లను నరికివేయాల్సి ఉంటుంది. ఒకవేళ చెట్లను తొలగించని పక్షంలో వచ్చే భక్తులకు పూర్తి సదుపాయాలు కల్పించం కష్టమని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. దీంతో వాటిని నరికి వేయడానికి అనుమతివ్వాలని ఎన్‌ఎంసీ పరిపాలన విభాగం కోర్టుకు దరఖాస్తు చేసుకుంది.

 ఈ దరఖాస్తును పరిశీలించిన కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఓ ధార్మిక కార్యక్రమానికి వందేళ్ల పాత చెట్లు, ఇంత పెద్ద సంఖ్యలో తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని కోర్టు స్పష్టం చేసింది. పర్యావరణాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరికి ఉందని, కాని ఎన్‌ఎంసీ కార్పొరేషన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. చెట్లు నరికివేయడం వల్ల పర్యావరణానికి జరిగే నష్టాన్ని ఎలా పూడుస్తారో ముందు తేల్చాలని కోర్టు కోరింది.


 అదేవిధంగా కుంభమేళా జరిగే పరిసరా ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయో వాటి వివరాలు అందజేయాలని ఆదేశించింది. ఇదిలాఉండగా కుంభమేళాకు అవసరమయ్యే నిధుల మంజూరు విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఇంతవరకు రాజీ కుదరలేదు. త్వరగా నిధులు అందజేస్తే ఏర్పాట్లు, ఇతర పనులు ప్రారంభిస్తామని ఇదివరకే ఎన్‌ఎంసీ విజ్ఞప్తి చేసింది. కాని ఎవరి వాటా ఎంతో తేలకపోవడంతో నిధులు ఇంతవరకు పంపిణీ కాలేదు.

మరిన్ని వార్తలు