జైలుకు రావాల్సిందే: కోవిడ్​ పేషెంట్​కు కోర్టు ఆదేశం

10 Jul, 2020 16:51 IST|Sakshi

లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

ముంబై: దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో కరోనా వైరస్​ ప్రబలకుండా ఉండేందుకు ఇరుకు లేకుండా చూసుకోవాలని మార్చి నెలలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఖైదీలను సాధ్యమైనంత వరకూ ఒకరికి ఒకరి మధ్య దూరం పాటించేలా చూడాలని సూచించింది. కానీ మహారాష్ట్రలో పరిస్థితి మరోలా ఉంది. కరోనాకు చికిత్స తీసుకుంటున్న ఓ ఖైదీని వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని నాగపూర్​లోని ముంబై హైకోర్టు బెంచ్​ ఆదేశించింది. ఖైదీ సరండర్​ కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. (కరోనా: రక్తపు గడ్డలపై కీలక పరిశోధన)

ముంబైకి చెందిన ఖైదీ(39)కి నగరానికి చెందిన బిల్డర్​ను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు శిక్షగా పడింది. నాగపూర్​ సెంట్రల్​ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. పోయిన మార్చి1న కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని జైలు నుంచి బయటకు వచ్చాడు. మార్చి 22 నాడు తిరిగి జైలుకి వెళ్లాల్సివుండగా, మహారాష్ట్ర లాక్​డౌన్​లోకి వెళ్లింది. ముంబై నుంచి నాగపూర్​కి చేరుకోవాలంటే 850 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాలి. లాక్​డౌన్​ సమయంలో ఇంత దూరం ప్రయాణించాలంటే అతను స్థానిక అధికారులను అనుమతి తీసుకోవాల్సివచ్చింది.(సీఎం ఆఫీసుకు మరోసారి కరోనా సెగ)

తాను జైలుకు తిరిగి వెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేశానని ప్రస్తుతం ఠాణేలోని తన ఇంట్లో క్వారంటైన్​లో ఉన్న ఖైదీ చెబుతున్నాడు. ‘నేను ఈ–పాస్​కు దరఖాస్తు చేశాను. కానీ అధికారులు దాన్ని తిరస్కరించారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న తలోజా కేంద్ర కారాగారం, ఠాణే కేంద్ర కారాగారాలకు వెళ్లి నన్ను అదుపులోకి తీసుకోమని కోరాను. వాళ్లు కొత్త ఖైదీలను తీసుకోవడం లేదని, నాగపూర్​కే వెళ్లాలని చెప్పారు. దాంతో నేను జైలు అధికారులకు ఈ–మెయిల్స్​, ఉత్తరాలు రాశాను’ అని  అతను వెల్లడించాడు.

జైలు అధికారుల నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో అతనికి ఇచ్చిన సెలవులను హైకోర్టు పలుమార్లు పొడిగించింది. అయితే, జూన్​ 16న ముంబై హైకోర్టు నాగపూర్​ బెంచ్​ జైలులో లొంగిపోవాలని తన క్లయింట్​ను ఆదేశించిందని ఖైదీ తరఫు న్యాయవాది ఆకాశ్ వెల్లడించారు. అప్పటికే తనకు కరోనా సోకిందని తెలియని ఖైదీ అందుకు ఒప్పుకున్నాడని చెప్పారు. మరుసటి రోజే అతనికి కోవిడ్​–19 పాజిటివ్​ అని తేలిందని వివరించారు. దీంతో మళ్లీ దరఖాస్తు పెట్టుకోగా, కోర్టు గడువు మరోమారు పొడిగించిందని చెప్పారు.

జూన్​ 28న చేసిన రెండో టెస్టులో కూడా ఖైదీకి పాజిటివ్​ వచ్చిందని ఆకాశ్​​ తెలిపారు. కానీ జులై 7న న్యాయమూర్తులు జెడ్​.ఏ.హక్​, ఎన్​.బి.సూర్యవంశిలతో కూడిన బెంచ్​ ఖైదీ ఆరోగ్యంతో నిమిత్తం లేకుండా, జైలులో జులై 18లోగా లొంగిపోవాలని ఆదేశించిందని పేర్కొన్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించిందని వివరించారు. కోర్టు ఆదేశాల వల్ల నాగపూర్​ జైల్లోని ఇతర ఖైదీలకు, ఆఫీసర్లకు వైరస్​ సోకే ప్రమాదం ఉంటుందని తెలిపారు. నాగపూర్ కేంద్ర కారాగారంలో 1810 మంది ఖైదీలను ఉంచొచ్చు. కానీ జూన్​ 30 నాటికి ఆ జైల్లో 2092 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో దాదాపు 140 మందికి కరోనా సోకిందని ఇప్పటికే రిపోర్టులు వచ్చాయి.

సుప్రీంకోర్టు ఆదేశాలతో తర్వాత మహారాష్ట్ర హోం శాఖ జైళ్లను 60 శాతం సామర్ధ్యానికి మించి నింపకూడదని నిర్ణయించింది. ఈ నిర్ణయం తీసుకుని మూడు నెలలు గడుస్తున్నా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. ఖైదీల సంఖ్యను తగ్గించుకునేందుకు జైళ్ల శాఖ చాలా కష్టపడుతోంది. 
జూన్​ 30 నాటికి మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60 జైళ్లు, 35 తాత్కాలిక క్వారంటైన్ సెంటర్లలో 28,463 మంది ఖైదీలు ఉన్నారు.

మరిన్ని వార్తలు