మరాఠాలకు రిజర్వేషన్లు సబబే

27 Jun, 2019 16:50 IST|Sakshi

సమర్థించిన బాంబే హైకోర్టు

రిజర్వేషన్లను 16 నుంచి 12–13 శాతానికి తగ్గించాలని సూచన 

ముంబై: మరాఠా వర్గానికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని బాంబే హైకోర్టు సమర్థించింది. అయితే, రిజర్వేషన్లను 16 శాతం బదులు రాష్ట్ర వెనుకబడిన కులాల కమిషన్‌ సూచించిన విధంగా 12 నుంచి 13 శాతం మధ్యలో ఉండేలా చూడాలని సూచించింది. మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్‌ రంజిత్‌ మోరే, జస్టిస్‌ భారతి డాంగ్రేలతో కూడిన ధర్మాసనం గురువారం తుది తీర్పు వెలువరించింది. కాగా, ఈ పిటిషన్లపై విచారణను న్యాయస్థానం ఏప్రిల్‌లోనే ముగించింది. ‘సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ప్రత్యేక తరగతిగా గుర్తించడం, వారికి రిజర్వేషన్లు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది.

రాష్ట్రపతి ప్రకటించిన జాబితాలోని వారికే రిజర్వేషన్లు కల్పించాలన్న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 342(ఎ)కు ఇది వర్తించదు. ఎందుకంటే, రాష్ట్ర బీసీ కమిషన్‌ వెల్లడించిన గణాంకాల ప్రకారం మరాఠాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారని రుజువైంది. అయితే, ప్రభుత్వం ఈ కోటాను 16 శాతం బదులు, బీసీ కమిషన్‌ సూచించిన ప్రకారం 12 నుంచి 13 శాతానికి తగ్గించాలి’ అని ధర్మాసనం పేర్కొంది. ‘రిజర్వేషన్‌ కోటా మొత్తం 50 శాతానికి మించరాదని గతంలో సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, గణాంకాలను అనుసరించి ఆ పరిమితిని దాటే వీలుంది’ అని ధర్మాసనం వివరించింది. అయితే, 16 శాతం రిజర్వేషన్‌ కోటా ప్రకారం ఇప్పటికే పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతులు ఇచ్చినట్లు తీర్పు వెలువడిన అనంతరం ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ ఏడాదికి 16 శాతం రిజర్వేషన్లనే కొనసాగించాలని కోరింది. దీనిపై ప్రత్యేకంగా మరో పిటిషన్‌ వేయాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది.

మరాఠాలకు రిజర్వేషన్ల నేపథ్యం
2017 జూన్‌: రాష్ట్రంలో మరాఠా వర్గం సాంఘిక, ఆర్థిక, విద్యాపరమైన పరిస్థితుల అధ్యయనం కోసం మహారాష్ట్ర సర్కారు రాష్ట్ర వెనుకబడిన కులాల కమిషన్‌ను నియమించింది.
2018 జూలై: రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో మరాఠాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన హింసాత్మక రూపం దాల్చింది.
నవంబర్‌ 2018: బీసీ కమిషన్‌ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది.
నవంబర్‌ 2018: మరాఠాలను వెనుకబడిన వర్గంగా గుర్తిస్తూ రాష్ట్ర అసెంబ్లీ వారికి 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు ఆమోదించింది. బిల్లుకు ఆమోదం తెలుపుతూ గవర్నర్‌ సంతకం చేశారు.
డిసెంబర్‌ 2018: మరాఠాలకు రిజర్వేషన్ల మొత్తం కోటా 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమంటూ బాంబే హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
మార్చి 2019: జస్టిస్‌ రంజిత్‌ మోరే, జస్టిస్‌ భారతి డాంగ్రేల ధర్మాసనం ఫిబ్రవరిలో ప్రారంభించిన విచారణను మార్చితో ముగించి, తుదితీర్పును రిజర్వులో ఉంచింది.
జూన్‌ 2019: మరాఠాలకు రిజర్వేషన్లను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. బీసీ కమిషన్‌ సిఫారసుల మేరకు రిజర్వేషన్లను 12 నుంచి 13 శాతం మధ్యలో ఉండేలా తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు