మోదీ మౌనంపై పుస్తకం.. కేసు నమోదు

21 Sep, 2018 16:04 IST|Sakshi
నరేంద్ర మోదీ (ఫైల్‌ ఫైట్‌)

గోద్రా అల్లర్ల సమయంలో మోదీ మౌనంగా ఉన్నారు

అసోం 12వ తరగతిలో పాఠ్యాంశం.. రచయితలపై కేసు నమోదు

సాక్షి,  న్యూఢిల్లీ : గోద్రా అల్లర్ల సమయంలో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉన్నారంటూ ముగ్గురు రచయితలు విడుదల చేసిన పుస్తకం అసోంలో వివాదంగా మారింది. అసొంలో 12వ తరగతి పొలిటికల్‌ సైన్స్‌ పాఠ్య పుస్తకంలో గోద్రా అల్లర్లపై ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. రచయితలు 2011లో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. సీఎంగా ఉన్న మోదీ అల్లర్లపై మౌనం వహించారని, దీంతో ఎంతో మంది అమాయక ప్రజల మరణానికి ఆయన కారణం అయ్యారని పుస్తకంలో వారు పేర్కొన్నారు.

 ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా పుస్తకాన్ని ముద్రించారని, దానిని వెంటనే బ్యాన్‌ చేయాలని కోరుతూ సుమిత్రా గోస్వామి, మానవ్‌ జ్యోతిలు పిటిషన్ దాఖలు చేశారు. మోదీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, విద్యార్థులకు తప్పుడు సమాచారాన్ని ఇస్తూ పుస్తకాన్ని ముద్రించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో పుస్తక రచయితలైన దుర్గా శర్మ, అఫిక్‌ జామాన్‌, బుర్హాన్‌లపై అసోంలోని గల్హట్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. దీనిపై రచయితలు స్పందిస్తూ.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఆర్‌టీ) సిలబస్‌ ప్రకారమే పుస్తకాన్ని రచించామని.. మోదీని తప్పుపట్టే విధంగా దానిలో ఎలాంటి అంశాలు లేవని రచయితలు తెలిపారు.

2011 నుంచి ఆ పుస్తకం పబ్లిష్‌ అవుతోందని ఇప్పుడు అనవసరంగా దానిపై వివాదం చేస్తున్నారని వారు వాపోయారు. దీనిపై అసోం విద్యాశాఖ మంత్రి సిద్దార్ధ భట్టాచార్య మాత్రం స్పందించేందుకు నిరాకరించారు. కాగా 2002 ఫిబ్రవరిలో గోద్రా సమీపంలో సబర్మతి రైలు తగలబడడంతో దాదాపు 57కిపైగా ప్రయాణికుల దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన మతఘర్షణలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అప్పట్లో సీఎంగా ఉన్న మోదీపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. 

మరిన్ని వార్తలు