ముగిసిన పార్లమెంట్‌ సమావేశాలు

10 Aug, 2018 20:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. పాలక, విపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా సాగిన ఉభయ సభలూ శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇక ప్రస్తుత సమావేశాల్లో చేపట్టిన బిల్లులు, సవరణలను లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ సభకు వివరించిన అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగంలో వివాదాస్పద వ్యాఖ్యలను సెక్రటేరియట్ అధికారులు రికార్డుల నుంచి తొలిగించారు. డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థిగా హరివంశ్, విపక్ష అభ్యర్థిగా హరిప్రసాద్ పోటీపడ్డారు.

హరివంశ్‌ విజయం తర్వాత ప్రసంగించిన ప్రధాని మోదీ.. డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ఇద్దరు హరిలు పోటీపడ్డారన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిని విపక్ష అభ్యర్థి హరిప్రసాద్ తప్పుపట్టారు. చైర్ హుందాతనాన్ని ప్రధాని దిగజార్చారని ఆరోపించారు. ఈ క్రమంలో  మోదీ ప్రసంగంలోని కొన్నిపదాలను రాజ్యసభ సెక్రటేరియట్‌ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. పదప్రయోగంతో విపక్ష అభ్యర్థి ఇబ్బందిపడిన కారణంగా.. వివాదాస్పద వ్యాఖ్యలను తొలిగించిన్నట్లు అధికారులు తెలిపారు. పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగం నుంచి కొన్ని పదాలను తొలగించడం ఇదే తొలిసారి.


పెద్దల సభలో చర్చకు రాని ట్రిపుల్‌ తలాఖ్‌..
వర్షాకాల సమావేశాల్లోనూ ప్రతిష్ఠాత్మక ట్రిపుల్‌తలాఖ్‌ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం లభించలేదు. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టలేదు.  సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేసినందున ట్రిపుల్‌ తలాఖ్‌ బిల్లును చేపట్టలేమని చైర్మన్‌ వెంకయ్యనాయుడు రాజ్యసభలో తెలిపారు.

ట్రిపుల్‌ తలాఖ్‌ బిల్లుకు గతేడాదే లోక్‌సభ ఆమోదం లభించింది.  రాజ్యసభలో ప్రభుత్వానికి తగిన మెజార్టీ లేకపోవడంతో  వ్యతిరేకత ఎదురైంది. ఎగువసభలో అడ్డంకులను అధిగమించేందుకు ట్రిపుల్‌ తలాఖ్‌ బిల్లుకు నిన్న కేంద్ర కేబినెట్‌ మూడు కీలక సవరణలు కూడా చేసింది. కానీ  పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రాజ్యసభ బిల్లుపై చర్చ చేపట్టలేదు. బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించనందున.. కేంద్రం ట్రిపుల్‌ తలాఖ్‌ ఆర్డినెన్స్‌ తీసుకురానుందని సమాచారం.

>
మరిన్ని వార్తలు