ఆన్‌లైన్‌ గేమ్స్‌ కోసం ఆ బాలుడు ఏం చేశాడంటే..

6 Sep, 2019 14:21 IST|Sakshi

లక్నో : ఆన్‌లైన్‌ వీడియో గేమ్స్‌ కోసం ఓ బాలుడు ఏకంగా తండ్రి పేరిట పేటీఎం ఖాతాను క్రియేట్‌ చేసి రూ 35,000 తస్కరించిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసైన నాలుగవ తరగతి చదివే బాలుడు తన తండ్రి మొబైల్‌ ఫోన్‌లో పేటీఎం ఖాతాను తెరిచి పెద్దమొత్తంలో డబ్బును విత్‌డ్రా చేశాడు. తన ఖాతాలో తనకు తెలీకుండా లావాదేవీలు జరగడంతో సైబర్‌ సెల్‌కు ఫిర్యాదు చేసిన బాధితుడికి తన కుమారుడే ఈ తతంగం నడిపించినట్టు తేలడంతో విస్తుపోయారు. దర్యాప్తు చేపట్టినప్పుడు పోలీసులతో పాటు తండ్రికి సైతం తమ చిన్నారిపై ఎలాంటి అనుమానం రాలేదు.

లావాదేవీలపై ఎక్కడా ఆధారాలు లభించకపోవడంతో బాలుడిని ప్రశ్నించగా తాను చేసిన నిర్వాకం బయటపెట్టాడని పోలీసులు తెలిపారు. పలు ఆన్‌లైన్‌ వీడియో గేమ్‌లను డౌన్‌లోడ్‌ చేసుకునే సమయంలో కొంతమొత్తం చెల్లించడం తప్పనిసరి కావడంతో తండ్రి మొబైల్‌ నుంచి పేటీఎం ఖాతాను క్రియేట్‌ చేసి దాన్ని ఆయన బ్యాంకు ఖాతాకు లింక్‌ చేశాడు. వీడియో గేమ్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే సమయంలో పేటీఎం వ్యాలెట్‌ ద్వారా డబ్బు చెల్లించేవాడు. ఇలా రూ 35,000 వరకూ తండ్రి ఖాతా నుంచి ఆన్‌లైన్‌ గేమ్స్‌కు వెచ్చించాడు. అయితే తన ఖాతా నుంచి ఆయా మొత్తం తగ్గుతుండటంపై తండ్రికి అంతుపట్టకపోవడంతో బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఆయన సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆరా తీయడంతో తానే ఇదంతా చేశానని చెప్పిన బాలుడు తన తండ్రి తనను శిక్షిస్తాడని భయపడ్డాడు. హజరత్‌గంజ్‌ పోలీసులు, సైబర్‌ సెల్‌ పోలీసులు బాలుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చిన అనంతరం ఇంటికి పంపారు.

మరిన్ని వార్తలు