అమ్మకోసం.. బిచ్చగాడిగా మారిన బాలుడు.!

27 Nov, 2017 22:15 IST|Sakshi

ఆస్పత్రి బిల్లు కట్టేందుకు బిచ్చగాడిగా మారిన పదేళ్ల బాలుడు 

ప్రాణం పోసే వైద్యులను కనిపించే దేవుళ్లని చెబుతారు. అలా వృత్తికి అంకితమై గొప్ప పేరుతెచ్చుకున్న డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు. కానీ వైద్యాన్ని కార్పొరేట్‌ కల్చర్‌  ఆవహించిన తర్వాత చాలామంది డబ్బు సంపాందించేందుకే డాక్టర్లవుతున్నారు. డబ్బు కట్టకపోతే మధ్యలో చికిత్సను కూడా ఆపేస్తున్నారు. ఇలాంటి వైద్యుల నిర్వాకమే.. ఓ పదేళ్ల బాలుణ్ని అడుక్కునే దయనీయ స్థితికి తీసుకొచ్చింది. వివరాల్లోకెళ్తే...

సాక్షి, స్కూల్‌ ఎడిషన్‌: కళ్లు తెరవని పసికందు కూడా అమ్మకోసం పరితపిస్తుంది. అమ్మ ఒడికి దూరమైతే అల్లాడిపోతుంది. అది అమ్మతనం గొప్పదనం. అలాంటి ఓ తల్లిని బతికించుకునేందుకు పదేళ్లు కూడా నిండని ఓ బాలుడు వీధుల్లో తిరుగుతూ బిచ్చమడుక్కున్నాడు. ఈ దౌర్భాగ్యస్థితికి కారణం వైద్యులేనన్న విషయం తర్వాత వెలుగుచూసింది. ‘డబ్బు తీసుకొచ్చే వరకు మీ అమ్మకు ట్రీట్‌మెంట్‌ చేయబోమ’ని డాక్టర్లు చెప్పడంతో చేసేదిలేక చేతులు చాచాడు. ఈ ఘటన బిహార్‌లోని పట్నాలో చోటుచేసుకుంది. 

బిల్లు చూసి... 
ఆరోగ్యం బాగాలేకపోవడంతో పదేళ్ల కొడుకు కుందన్‌ను వెంటబెట్టుకొని బిహార్‌లోని మాధేపురా జిల్లాలో ప్రైవేటు నర్సింగ్‌హోం వెళ్లింది ఓ తల్లి. రకరకాల పరీక్షలు చేసి, చిన్నపాటి ఆపరేషన్‌ చేయాలన్నారు డాక్టర్లు. ఐదువేలో.. పదివేలో అవుతుందనుకొని సరేనన్నారు. తీరా ఆపరేషన్‌ అయ్యాక రూ.70వేల బిల్లు చేతిలో పెట్టారు. దానిని చూసిన తల్లీకొడుకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తమవద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో.. ఇంకా ట్రీట్‌మెంట్‌ మిగిలే ఉందని, మధ్యలో ఆపేస్తామని, ఏం చేసైనా డబ్బులు తెమ్మని చెప్పారు. బిల్లు చెల్లించేదాకా డిశ్చార్జ్‌ చేసేది లేదని చెప్పారు. శస్త్రచికిత్స తర్వాత వేసిన కుట్లను ఊడదీయకుండా అలాగే ఉంచేశారు. వైద్యమూ నిలిపివేశారు.  

సొంతూరికెళ్లి.. 
యాజమాన్యం వేసిన భారీ బిల్లును చెల్లించలేక...సాయం చేసే వారెవరూ కానరాక... ఆమె పదేళ్ల కుమారుడు కుందన్‌ చివరకు మధేపురాజిల్లాలోని తన సొంతూరికి వెళ్లాడు. ‘అమ్మ ఆసుపత్రి బిల్లు చెల్లించాలి.. సాయం చేయండ’ంటూ వీధివిధి తిరిగాడు. చివరకు విషయం మాధేపురా ఎంపీకి తెలియడంతో... హుటాహుటిన ఆయన నర్సింగ్‌హోంకు వెళ్లి, తల్లిని డిశ్చార్జ్‌ చేయించాడు. 

మరిన్ని వార్తలు