బాయ్‌కాట్‌ చైనా

1 Jun, 2020 04:18 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ‘బాయ్‌కాట్‌ చైనా’ ఆన్‌లైన్‌ ఉద్యమం తెరపైకొచ్చింది. 3ఇడియట్స్‌ సినిమాకు ప్రేరణగా నిలిచిన విద్యావేత్త, ఆవిష్కర్త సోనమ్‌ వాంగ్చుక్‌ యూట్యూబ్‌లో షేర్‌ చేసిన వీడియో ఈ పరిణామానికి ఊపిరిపోసింది. వాంగ్చుక్‌కు పలువురు నెటిజన్లు, సెలిబ్రిటీలు మద్దతు పలికారు. వీరిలో అర్షద్‌ వార్సి, మిలింద్‌ సోమన్, రణ్‌వీర్‌ షోరే తదితరులున్నారు. చైనా వస్తువుల వాడకం మానేయాలని వీరు కోరుతున్నారు. ‘చైనా వస్తువులను వాడటం నేను ఆపేస్తున్నా.

మీరూ ఆపండి’అని అర్షద్‌ వార్సీ కోరారు. చైనా వీడియో అప్లికేషన్‌ టిక్‌టాక్‌ను వాడబోనంటూ యాక్టర్, మోడల్‌ మిలింద్‌ ఉషా సోమన్‌ ట్వీట్‌ చేశారు. నటుడు రణ్‌వీర్‌ షోరే ఆమెకు మద్దతు ప్రకటించారు. భారత్‌ తయారీ వస్తువులనే వాడాలంటూ టీవీ నటి కామ్య పంజాబీ కోరారు. చైనా ఉత్పత్తులతో వాణిజ్య సంబంధాలున్న వారంతా ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకోవాలన్నారు. రచయిత రాజ్‌ శాండిల్య కూడా ‘బాయ్‌కాట్‌ చైనా’ ఆన్‌లైన్‌ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పిలుపు ఇచ్చిన విధంగా ప్రపంచం చైనాను ఏకాకిగా చేయాలని ఫొటోగ్రాఫర్‌ అతుల్‌ కస్బేకర్‌ కోరారు.

మరిన్ని వార్తలు