వివాదంగా మారిన లోక్‌సభ స్పీకర్‌ వ్యాఖ్యలు

11 Sep, 2019 11:07 IST|Sakshi

ఓ కులానికి మద్దతుగా వ్యాఖ్యలు

సోషల్‌ మీడియాలో విమర్శలు

జైపూర్‌: ఓ కులానికి మద్దతుగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా చేసిన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ కులాలు, మతాలను ప్రోత్సహించడం ఏంటని సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు వినిపిస్తున్నాయి. రాజస్తాన్‌లో కోటాలో మంగళవారం జరిగిన బ్రాహ్మణ సామాజిక వర్గ ఐక్యత సమావేశానికి ఓం బిర్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మనమంతా (బ్రాహ్మణ) ఐక్యంగా ఉండాలి. అప్పుడే ఉన్నత స్థాయిలోకి చేరుకుంటా. ప్రస్తుతం దేశంలో మనమే అందరికన్నా ముందున్నాం. సమాజాన్ని శాసించే స్థాయికి చేరు​కోవాలి’ అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన ప్రసంగ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై సోషల్‌ మీడియా యూజర్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

గుజరాత్‌ ఎమ్మెల్యే, ఉద్యమ నేత జిగ్నేష్‌ మేవానీ ట్వీట్‌ చేస్తూ.. ‘రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న స్పీకర్‌ ఇలా కులాలను ప్రోత్సహించడం సరికాదు. వెంటనే ఆయన పదవికి రాజీనామా చేయాలి. ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.  కులాలను పెంచిపోషిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై పౌరహక్కుల సంఘం కూడా స్పందించింది. స్పీకర్‌ వ్యవహారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. బాధ్యత గల పదవిలో ఉన్న బిర్లా ఇలా ఓ వర్గాన్ని పొగుడుతూ మాట్లాడం సరికాదని ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని పేర్కొంది.

మరిన్ని వార్తలు