సూదితో మెదడకు చికిత్స

25 Feb, 2015 22:52 IST|Sakshi

చెన్నై: మెదడులోని వ్యాధిని గుర్తించడంలో ప్రభుత్వాస్పత్రి వైద్యులు రికార్డు సృష్టించారు. శస్త్రచికిత్స ద్వారా మాత్రమే కనుగొనే అవకాశం ఉన్న మెదడులోని గడ్డను కేవలం సూది సహాయంతో నిర్ధారించారు. చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వాస్పత్రి (జీహెచ్)లోని మెదడు వ్యాధి నివారణ విభాగంలో కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధులకు ఆధునిక చికిత్సను అందిస్తున్నారు. తాజాగా ఈ విభాగానికి రూ.55 లక్షలతో అత్యాధునిక యంత్రం మంజూరైంది. స్ట్రియోటాక్సీ అనే పేరుగల ఈ యంత్రం సహాయంతో మెదడులో అతి సున్నితమైన ప్రాంతంలో, ఇతర పరీక్షలకు అందని క్లిష్టతరమైన వ్యాధులను సులభంగా కనుగొని చికిత్స చేయవచ్చని అక్కడి వైద్యులు చెబుతున్నారు.

 స్ట్రియోటాక్సీ యంత్రం పనితీరును వివరించేందుకు బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆస్పత్రి డీన్ విమల, డిప్యూటీ డీన్ రంగరాజన్ జోతి మాట్లాడుతూ, మెదడులో గడ్డలు ఏర్పడితే వాటిని గుర్తించేందుకు రోగికి అనస్తీషియా (మత్తుమందు) ఇవ్వకుండా, శస్త్రచికిత్స చేయకుండానే గుర్తించవచ్చని తెలిపారు. రోగి స్పృహలో ఉండగానే తలలోకి సూదిని ప్రవేశింపజేసి మెదడులోని గడ్డలను తొలగించవచ్చని చెప్పారు. ఈ విధానం వల్ల తలకు అతిపెద్ద శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం తప్పుతుందని అన్నారు. అంతేగాక రోగి కొన్ని రోజుల్లో వ్యాధినయమై డిశ్చార్జి కావచ్చని తెలిపారు. ఈ ఆధునిక యంత్రం ద్వారా ఇప్పటి వరకు 9 మందికి విజయవంతంగా చికిత్సలు జరిపినట్లు చెప్పారు. ఈరకమైన చికిత్సకు ప్రయివేటు ఆస్పత్రుల్లో రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుండగా తాము పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నామని అన్నారు.

మరిన్ని వార్తలు