‘బ్రాండెడ్‌’ బాటిళ్లలో ప్లాస్టిక్‌ కణాలు...!

15 Mar, 2018 21:33 IST|Sakshi

ప్రముఖ కంపెనీల  మినరల్‌ వాటర్‌ బాటిళ్లలో ప్లాస్టిక్‌ అవశేషాలు

భారత్‌ సహా 9 దేశాల్లో అధ్యయనం

పీల్చే గాలి, తినే ఆహారం...చివరకు దాహాన్ని తీర్చుకునేందుకు గుక్కెడు నీళ్లు తాగాలంటేనే భయపడాల్సిన పరిస్థితులొచ్చేశాయి. పేరొందిన  బ్రాండెడ్‌ మినరల్‌ వాటర్‌  కంపెనీలకు చెందిన బాటిల్‌ నీళ్లలో సూక్ష్మస్థాయిలో ప్లాస్టిక్‌ ముక్కలున్నట్టు వెల్లడైంది.  పూర్తిగా శ్రేయస్కరమైనవని,  ఎలాంటి సందేహం లేకుండా తాగేయవచ్చునని భావించే వాటర్‌ బాటిళ్లలో 90 శాతం కంటే ఎక్కువ వాటిలో అతిచిన్న ప్లాస్టిక్‌ అవశేషాలున్నట్టు బయటపడింది.

కుళాయిల్లోని (నల్లాలు) నీటి కంటే రెండురెట్లు అధికంగా ఈ వాటర్‌బాటిళ్లలో ప్లాస్టిక్‌ ఫైబర్లున్నట్టు న్యూయార్క్‌ స్టేట్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో తేలింది . భారత్‌తో సహా అమెరికా, చైనా, బ్రెజిల్, ఇండోనేషియా, మెక్సికో, థాయ్‌లాండ్, లెబనాన్, కెన్యాలలో కొనుగోలు చేసిన బాటిళ్లను పరీక్షించినపుడు విస్మయం కలిగించే ఈ అంశం వెలుగుచూసింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహేచ్‌ఓ) స్పందిస్తూ మంచినీళ్లలో ప్లాస్టిక్‌  వల్ల వాటిల్లే ప్రమాదాన్ని వెంటనే సమీక్షించనున్నట్టు ప్రకటించింది. 

ఒక్కో లీటర్‌లో 10వేల ప్లాస్టిక్‌ అవశేషాలు..
ప్రపంచవ్యాప్తంగా 9 దేశాల్లోని 19 ప్రాంతాల నుంచి 11 రకాల  ప్రజాదరణ పొందిన 259 బ్రాండెడ్‌  మినరల్‌ వాటర్‌ బాటిళ్లను ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. ప్రతీ లీటర్‌ మంచినీళ్ల సీసాలో  సగటున 325 ప్లాస్టిక్‌ కణాలున్నట్టు గుర్తించారు. ఒక్కో లీటర్‌ బాటిల్‌లో అత్యధికస్థాయిలో 10 వేల ప్లాస్టిక్‌ అవశేషాలున్నట్టు తెలిసింది. మొత్తం 259 బాటిళ్లలో కేవలం 19 సీసాల్లో మాత్రమే ఎలాంటి ప్లాస్టిక్‌ లేదని తేలింది. జర్నలిజం ప్రాజెక్ట్‌ ఆర్బ్‌ మీడియా సూచన మేరకు న్యూయార్క్‌స్టేట్‌ యూనివర్శిటీ వాటర్‌ బాటిళ్లలోని నీటిని విశ్లేషించే పని చేపట్టింది. కుళాయిల నీళ్లపై  గతంలో తాము నిర్వహించిన పరిశోధనతో పోల్చి చూస్తే ‘బాటిల్డ్‌ వాటర్‌’’లో మైక్రోప్లాస్టిక్‌ రెండింతలున్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

అయితే ఈ అంశంపై అధ్యయనానికి ఆర్బ్‌మీడియా అనుసరించిన విధానాన్ని నెస్ట్‌లే తప్పుబట్టింది. నైల్‌రెడ్‌డై సాంకేతికతో కచ్చితమైన ఫలితాలు వెలువడే అవకాశాలు లేవని సీబీసీ ఏజెన్సీకి ఈ సంస్థ ఒక ప్రకటనలో  తెలిపింది. తాము కఠినతరమైన పద్ధతుల ద్వారా నీటి ఫిల్టరేషన్‌ను చేపడుతున్నట్లు కోకాకోలా బీబీసీకి వెల్లడించింది. అయితే అత్యంత హెచ్చుస్థాయిలో శుద్ధిచేపట్టినపుడు కూడా పర్యావరణంలో అత్యంత  సూక్ష్మస్థాయిలో ఉన్న ప్లాస్టిక్‌ ఫైబర్లు అందులో కనిపించే అవకాశాలున్నాయని పేర్కొంది.
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

మరిన్ని వార్తలు