ఢిల్లీ అత్యంత కాలుష్య నగరం కాదు

13 May, 2016 09:31 IST|Sakshi
ఢిల్లీ అత్యంత కాలుష్య నగరం కాదు

డబ్ల్యూహెచ్‌వో తాజా జాబితా
న్యూఢిల్లీ: ప్రపంచంలోని తొలి ఏడు అత్యంత కాలుష్య నగరాల్లో భారత్‌నుంచి  నాలుగు నగరాలున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం వెల్లడించింది. అయితే గతేడాది వెల్లడించిన వివరాల్లో తొలి స్థానంలో ఉన్న ఢిల్లీ ఈసారి 11వ స్థానంలో నిలిచింది. ఢిల్లీలో ఏడాదికి సగటున కాలుష్యసూచీ 122 (ఘనపు మీటర్లో ఉండే మైక్రోగ్రాముల కాలుష్యం) గా నమోదైందని, గతేడాది జాబితాలో ఇది 153గా ఉందని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగానే దేశరాజధాని కాలుష్య రేటింగ్స్‌లో మార్పు వచ్చిందని తెలిపింది.

ప్రపంచంలోని 80 శాతం నగరాల్లో ప్రజలు కాలుష్యమైన గాలినే పీల్చుకుంటున్నారన్న డబ్ల్యూహెచ్‌వో.. 103 దేశాల్లోని 3వేల నగరాల్లో సేకరించిన కాలుష్య వివరాలను విశ్లేషించి తాజా జాబితాను రూపొందించింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రపంచ కాలుష్య నగరాల జాబితాలో రెండోస్థానంలో ఉండగా.. యూపీలోని అలహాబాద్ (3), పట్నా (6), రాయ్‌పూర్ (7) టాప్-7లో ఉన్నాయి. నిరుటి జాబితాలో టాప్-20 కాలుష్య నగరాల్లో 13 భారత నగరాలుండగా.. ఈ సంఖ్య తాజా జాబితాలో 10కి చేరింది. ఇరాన్‌లోని జబోల్ నగరం అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది.

కాగా, యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లో నగరాల్లో కాలుష్య ప్రభావం క్రమంగా తగ్గుతుండగా.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో (ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, ఆగ్నేయాసియా దేశాల్లో) పెరుగుదల కనబడుతోందని.. ఆయా దేశాలు దీనిపై దృష్టిసారించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించింది. అయితే.. కోటి 40లక్షలకు మించి జనాభా ఉన్న నగరాల కాలుష్యంలో మాత్రం ఢిల్లీయే ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండగా.. ఈజిప్టులోని కైరో, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు