కోల్‌ స్కాం : జిందాల్‌పై ముడుపుల అభియోగం

10 Jan, 2018 19:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బొగ్గు గనుల కేటాయింపు స్కాంలో పారిశ్రామికవేత్త, కాంగ్రెస్‌ నేత నవీన్‌ జిందాల్‌ ఇతరులపై ముడుపుల అభియోగాలూ నమోదు చేసినట్టు ప్రత్యేక న్యాయస్ధానానికి సీబీఐ నివేదించింది. జార్ఖండ్‌లోని అమరకొండ ముర్గదంగల్‌ కోల్‌ బ్లాక్‌ కేటాయింపునకు సంబంధించిన కేసులో నిందితులపై ముడుపుల అభియోగాలను నమోదు చేశామని తెలిపింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 7, 12 కింద ప్రభుత్వ అధికారికి ముడుపులు చెల్లించడం లేదా స్వీకరించడం శిక్షార్హమని..నిందితులపై ఆయా సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశామని సీబీఐ తరపు న్యాయవాది వీకే శర్మ చెప్పారు.

ఈ కేసులో జిందాల్‌తో పాటు కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, జార్ఖండ్‌ మాజీ సీఎం మధుకోడా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా సహా 11 మందిపై నేరపూరిత కుట్ర, మోసం వంటి పలు అభియోగాలు నమోదు చేయాలని 2016, ఏప్రిల్‌లో న్యాయస్ధానం ఆదేశించగా, తాజాగా వీరిపై ముడుపుల ఆరోపణలనూ చార్జ్‌షీట్‌లో చేర్చారు.

మరిన్ని వార్తలు