ఎథిక్స్ కమిటీకి ‘స్టింగ్’ వ్యవహారం

17 Mar, 2016 04:35 IST|Sakshi

- టీఎంసీ ఎంపీల 'లంచం' కేసు
- లోక్‌సభ స్పీకర్ ప్రకటన
- అభ్యంతరం చెప్పిన  తృణమూల్ ఎంపీ

న్యూఢిల్లీ:
కొందరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు లంచం తీసుకున్నట్టుగా వెలుగులోకి వచ్చిన స్టింగ్ ఆపరేషన్ వ్యవహారాన్ని బుధవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎథిక్స్ కమిటీ పరిశీలనకు నివేదించారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించి దర్యాప్తు చేయాలని స్పీకర్, ఎల్.కె.అద్వానీ నాయకత్వంలోని ఎథిక్స్ కమిటీని కోరారు. ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. 2005లో కూడా ఎథిక్స్ కమిటీ లంచం వ్యవహారంలో 11 మంది ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.

తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగత్‌రాయ్ స్పీకర్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం తెలి పారు. ఇది ఏకపక్ష నిర్ణయమన్నారు.  అద్వానీ నాయకత్వంలో దర్యాప్తు జరిగితే పూర్తి పా రదర్శకంగా ఉంటుందన్నారు. కాగా, సౌగత్ రాయ్ అభ్యంతరాలను స్పీకర్ తోసిపుచ్చారు.

జేపీసీతో విచారణ జరిపించాలి: సీపీఎం
స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో తృణమూల్, కేంద్ర సర్కారు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని సీపీఎం ఆరోపించింది. ఈ అంశంపై సీపీఎం సభ్యులు బుధవారం రాజ్యసభలో తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని  పట్టుబట్టారు. తృణమూల్ ఎంపీల వ్యవహారంపై రెండు నోటీసులు వచ్చాయని జీరో అవర్ ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ కురియన్ తెలిపారు. అయితే వాటిని చైర్మన్ తిరస్కరించారని వెల్లడిం చారు.

కానీ ఈ అంశంపై మాట్లాడేందుకు కురియన్, తృణమూల్ ఎంపీ డెరిక్, సీపీఎం సభ్యుడు సీతా రాం ఏచూరీని అనుమతించారు. తమ పార్టీ ఎంపీలపై వచ్చిన ఆరోపణలను డెరిక్ తోసిపుచ్చారు. స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన వ్యక్తి జర్నలిస్టో కాదో ముందు నిర్ధారించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. ఆ వీడియోలు విశ్వసించదగ్గవి కావని అన్నారు. కాగా, ఈ వీడియోలపై విచారణ జరిపించాల్సిన అవసరముందని సీతారాం ఏచూరీ డిమాండ్ చేశారు. అదే సమయంలో సీపీఎం సభ్యులు సభ వెల్‌లోకి దూసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని వారు నిలదీశారు. ప్రభుత్వానికి, తృణమూల్‌కు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఏచూరి ఆరోపించారు.

మాపై కుట్రచేస్తున్నారు..: మమత
ప్రతిపక్ష పార్టీలు కుట్రతోనే తమ పార్టీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. విపక్ష పార్టీలన్నీ దుష్టకూటమిగా ఏర్పడ్డాయని దుయ్యబట్టారు. కేవలం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే విపక్షాలు స్టింగ్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చాయని ఆరోపించారు. కాల్‌చీనీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగిస్తూ, మీడియాలోని ఓవర్గం, విపక్ష పార్టీలు చేతులు కలిపి తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని అన్నారు.

మరిన్ని వార్తలు