వరుడి కిడ్నాప్ కలకలం.. వధువు అరెస్ట్

27 May, 2017 17:06 IST|Sakshi
వరుడి కిడ్నాప్.. వధువు సహా నలుగురి అరెస్ట్

పట్నా: వరుడిని కిడ్నాప్ చేసిన వ్యవహారంలో వధువు సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బిహార్ లోని ముజఫర్ పూర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. ముజఫర్ పూర్ ఈస్ట్ డీఎస్పీ ముస్తాఫిక్ అహ్మద్ కథనం ప్రకారం.. జూలీ అనే యువతికి మిథాలీ గ్రామానికి చెందిన అభినయ్ కుమార్ తో వివాహం చేయాలని వధువు కుటుంబసభ్యులు నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అభినయ్ ని వధువు బంధువులు నంద్ కిశోర్ సింగ్, మరికొందరు కలిసి కిడ్నాప్ చేశారు. అభినయ్ కిడ్నాప్ అయ్యాడని గైఘాట్ పోలీసులకు అతడి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. 'పకాడ్వా షాది' అనే సంప్రదాయం ప్రకారం తమకు కావలసిన వ్యక్తిని కిడ్నాప్ చేసి అతడికి బలవంతంగా పెళ్లి చేయడం బిహార్ లో కొనసాగుతుండేది.

వధువు బంధువులు నిర్ణయించినట్లుగానే పెళ్లి ఏర్పాట్లు అన్ని జరిగిపోయాయి. శుక్రవారం మరికాసేపట్లో వివాహం జరుగుతుందనగా జూలీ ఇంటికి చేరుకున్న పోలీసులు అభినయ్ ని వారి చెర నుంచి విడిపించారు. అయితే వధువు తరఫు బంధువులు పోలీసులపై దాడులకు దిగి విధ్వంసం సృష్టించారు. పోలీసులను వారి దాడులను అడ్డుకుని కల్యాణ మండపం వద్ద ఉన్న వధువు సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వధువు జూలీని, ఆమె సోదరి, సోదరుడు, మరో వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ చేశారు. ఈ నలుగురిని అనంతరం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా, షాహిద్ ఖుదీ రామ్ బోస్ సెంట్రల్ జైలుకు జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించారు.

అభినయ్ ఇష్టప్రకారమే వివాహం జరుగుతుందని వధువు బంధువులు పోలీసులను నమ్మించాలని చూశారు. అయితే అక్కడ వరుడి కుటుంబంగానీ, బంధువులుగానీ ఏ ఒక్కరూ లేరని నిర్ధారించుకున్న తర్వాతే పోలీసులు అతడిని రక్షించారని డీఎస్పీ తెలిపారు. తనను జూలీ బంధువులు కిడ్నాప్ చేశారని, బలవంతంగా పెళ్లి చేయాలని ప్రయత్నించారని ఆరోపించాడు. వధువు బంధువు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. జూలీ, అభినయ్ కుమార్ కి గతంలోనే పెళ్లి నిశ్చయమైందని, కట్నం అడగటంతో గొడవ తలెత్తి పెళ్లి రద్దయిందని చెప్పాడు. ఆ కారణం వల్లే వరుడిని ఎలాగైనా తీసుకొచ్చి పెళ్లి చేయాలని చూశారని చెప్పుకొచ్చాడు. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని డీఎస్పీ ముస్తాఫిక్ అహ్మద్ వివరించారు.

మరిన్ని వార్తలు