వాట్సప్‌ వాడే అమ్మాయి మాకొద్దు..!

9 Sep, 2018 14:59 IST|Sakshi

వధువు వాట్సప్‌ను అతిగా వాడుతోందని వివాహం రద్దు

మరి కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి కూతురు తండ్రి ఉరోజ్‌ మెహందీతో సహా వారి తరఫు బంధువులంతా మగ పెళ్లివారి’బారాత్‌’ (వివాహ ఊరేగింపు) కోసం వేచి చూస్తున్నారు. సమయం మించి పోతుండడంతో పెళ్లి కొడుకు తండ్రికి మెహందీ ఫోన్‌ చేయగా వివాహాన్ని రద్దు చేసుకుంటున్నామంటూ అటువైపు నుంచి సమాధానం వచ్చింది. పెళ్లి కుమార్తె ఎక్కువగా వాట్సాప్‌లోనే కాలం గడుపుతున్నందున ఆమెతో వివాహానికి తమ కొడుకు ఇష్టపడక పోవడమే ప్రధాన కారణమంటూ వారు స్పష్టంచేశారు. ఇంకా పెళ్లి కూడా కాకుండానే కాబోయే అత్తమామలకు లెక్కకు మించి వాట్సాప్‌ మెసేజ్‌లు పంపించడం చూస్తే పెళ్లికూతురు ఎంతగా వాట్సాప్‌ వినియోగిస్తోందో అర్థం అవుతోందని నిక్కచ్చిగా చెప్పేశారు.

అయితే మెహందీ మాత్రం  వియ్యాలవారు పెళ్లి రద్దు చేసుకోడానికి వాట్సాప్‌ కారణం కాదని కట్నం కింద రూ.65 లక్షలు ఇవ్వాలనే వారి డిమాండ్‌ను తాము ఒప్పుకోకపోవడం వల్లేనని తెలిపాడు. ఆయన పెళ్లికొడుకు, వారి కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేయడంతో కేసు రిజిష్టర్‌ చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. వధువు వాట్సాప్‌ ఎక్కువగా ఉపయోగిస్తున్న కారణంగా, పెళ్లికి ముందే కాబోయే అత్తమామలకు వాట్సాప్‌ మెసేజ్‌లు పంపించిన కారణంగానే ఆ వివాహం రద్దు చేసుకుంటున్నట్టు  సెప్టెంబర్‌ 5న జరగాల్సిన పెళ్లిని రద్దు చేసుకున్నట్టు పెళ్లి కుమారుడు తరఫు వారు చెబుతున్నట్టు ఆమ్రోహీ ఎస్పీ విపిన్‌ టడా తెలిపారు. ఇలా ఓ వింత కారణంతో ఉత్తరప్రదేశ్‌ ఆమ్రోహీ జిల్లా నౌగావ్‌ సాదత్‌ గ్రామానికి మెహందీ కుమార్తెతో ఫకీర్‌పురాకు చెందిన ఖమర్‌ హైదర్‌ కుమారుడికి జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది.
యూపీ, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో  పెళ్లి కొడుకులు, వారి తరఫు వారు కట్నంతో పాటు  వింత వింత కోరికలు కోరడం, కొన్ని విషయాల్లో పెళ్లి కూతురు తరఫు  వాళ్ల అభ్యంతరాల కారణంగా పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలున్నాయి.

వివాహ విందులో తాము కోరిన మాంసాహారాన్ని  కాబోయే అత్తమామలు ఏర్పాటు చేయని  కారణంగా   ఇటీవల యూపీ రాంపూర్‌కు చెందిన ఓ పెళ్లికొడుకు పెళ్లి రద్దుచేసుకున్నాడు.
విందులో పెళ్లి కొడుకు సోదరుడికి  వధువు బం«ధువు ఒకటి కంటే ఎక్కువ రసగుల్లాలు ఇవ్వడానికి నిరాకరించినందుకు గత ఏప్రిల్‌లో యూపీలో ఓ పెళ్లి నిలిచిపోయింది.
మ్యారేజ్‌ పార్టీలో అతిథులకు తగినన్నీ ఐస్‌క్రిమ్‌లు అందించనందుకు వియ్యంకుల మధ్య తలెత్తిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చి రెండువర్గాల మధ్య బాహాబాహీకి దారితీసి చివరకు పెళ్లి రద్దయింది.
పెళ్లి నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాలు మొదలుకావడానికి ముందే పెళ్లికుమారుడు చేసిన నాగిన్‌డ్యాన్స్‌ చికాకు కలిగించిందని యూపీ షాజహాన్‌పూర్‌కు చెందిన పెళ్లి కూతురు వివాహం రద్దుచేసుకుంది.
ఉరుములు, మెరుపుల తర్వాత పెళ్లికొడుకు వింతగా ప్రవర్తించాడంటూ  గత జూన్‌ బిహార్‌లోని సరన్‌కు చెందిన వధువు అతడిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది.
 

మరిన్ని వార్తలు