భారత ఆర్థిక వ్యవస్థకు మంచి భవిష్యత్తు

9 Oct, 2017 13:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ భవిష్యత్తు మాత్రం ఆశజనకంగానే కనిపిస్తోంది. దేశ ఆర్థిక వద్ధి రేటు 5.7 శాతానికి పడిపోయినప్పటికీ బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్న దేశాల్లో ప్రపంచంలోనే ఫ్రాన్స్, ఇటలీ దేశాలకు మధ్యన ఏడవ స్థానాన్ని ఆక్రమించింది. అంతేకాకుండా ప్రపంచంలో చైనా తర్వాత వేగంగా అభివద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలబడింది. 2050 సంవత్సరం నాటికి చైనా తర్వాత రెండవ బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ బలపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

134 కోట్ల మంది జనాభాతో భారత్, ప్రపంచంలోనే 18 శాతం జనాభా కలిగి ఉంది. 2024 సంవత్సరం నాటికి జనాభాలో చైనాను భారత్‌ అధిగమిస్తుందని కూడా నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువతను కలిగిన దేశం కూడా భారతే. అయితే 30 శాతం మంది యువతకు చదువు, ఉద్యోగం, శిక్షణ లేకపోవడం విచారకరం. దేశాన్ని అవినీతి ఎక్కువ పట్టి పీడిస్తుందని కార్యనిర్వాహక వర్గం భావిస్తున్నట్లు ప్రపంచ  ఆర్థిక ఫోరం ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవినీతి అనేది దేశంలో ఇంకా పెద్ద సమస్యగానే ఉందని ఆర్థిక ఫోరమ్‌ అభిప్రాయపడింది. భారత్‌లో వ్యాపారం చేయడం ముడుపులతో కూడిన వ్యవహారమని భారతీయులు అభిప్రాయపడుతున్నట్లు తెలియజేసింది. 

భారత ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ వల్ల దేశంలోని 29 రాష్ట్రాలు ఉమ్మడి మార్కెట్‌గా మారిపోయాయని, ప్రస్తుతం కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ జీఎస్టీ మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌ ఆ నివేదికలో అభిప్రాయపడింది. దేశ అవసరాల కోసం డబ్బును అధికంగా వెచ్చిస్తున్న దేశాల్లో భారత్‌ 23వ స్థానాన్ని ఆక్రమించిందని తెలిపింది. మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల పెద్ద ప్రయోజనం ప్రస్తుతం కనిపించడం లేదని, దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటే ఉండవచ్చని అంది. సమ్మిలిత ఆర్థిక అభివద్ధిలో మాత్రం 79 వర్ధమాన దేశాల్లో 60వ స్థానంలో బాగా వెనకబడి ఉందని పేర్కొంది. దీనివల్ల ధనికులు, పేదల మధ్య అంతరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని 53 శాతం సంపద దేశంలోని 1 శాతం ధనవంతుల వద్ద పేరుకుపోయిందని అంచనా వేసింది. అదే అమెరికాలో 37 శాతం సంపద 1 శాతం ధనవంతుల వద్ద పేరుకుపోయిందని తెలిపింది.

మరిన్ని వార్తలు