అభిషేకం చేస్తుండగా గరుడ పక్షి ప్రదక్షిణ

6 Feb, 2020 09:05 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తంజావూరు బృహదీశ్వరాలయంలో మహా కుంభాభిషేకం ఘనంగా జరిగింది. దీన్ని వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో 23 ఏళ్ల తర్వాత మహా కుంభాభిషేకం నిర్వహించడంతో.. దీన్ని తిలకించడానికి దేశవిదేశాల నుంచి నాలుగు లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. దీంతో తంజావూరు ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. బృహదీశ్వరాలయ ప్రధాన రాజగోపురంతో పాటు ఆలయ ప్రాంగణంలోని పలు దేవతామూర్తుల ఆలయ శిఖరాలపైనా శివాచార్యులు, శైవాగమ పండితులు, ఓదువార్లు పవిత్ర నదీజలాలతో గోపురాలపైనున్న స్వర్ణ, రజిత, కాంస్య కలశాలకు సంప్రోక్షణ చేశారు. ఇందుకోసం యోగశాలలో ఉంచిన గంగా, యమున, కావేరి నదుల పవిత్రజలాలతో నిండిన 705 కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కలశాలకు పవిత్ర జలాలతో అభిషేకం
మహాకుంభాభిషేకంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులకు తిరుమల తరహాలో దర్శన సదుపాయం కల్పించారు. రద్దీ విపరీతంగా ఉండటంతో తొక్కిసలాటలు చోటుచేసుకోకుండా పోలీసులు, ఆలయ నిర్వాహకులు నంది మంటపం వద్ద కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేశారు. భక్తులు మైమరచి, భక్తిపారవశ్యంతో ‘పెరువుడయారే వాళ్గ’, హర హర శంకరా! పెరువుడయారే (బృహదీశ్వరా) అంటూ జయజయ ధ్వానాలు చేశారు. కాగా.. బృహదీశ్వరాలయ గోపురంపైనున్న స్వర్ణకలశంపై శివాచార్యులు పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహిస్తున్న సమయంలో ఓ గరుడ పక్షి (గద్ద) ఆకాశంలో ప్రదక్షిణ చేసి వేగంగా మాయమైంది. ఆ దృశ్యాన్ని చూసి శివాచార్యులు, భక్తులు పులకించిపోయారు.

మరిన్ని వార్తలు