ఉన్నదాంట్లోనే పంచుకోండి!

20 Oct, 2016 02:57 IST|Sakshi
ఉన్నదాంట్లోనే పంచుకోండి!

కృష్ణా జలాల వివాదంపై తేల్చి చెప్పిన బ్రిజేశ్ ట్రిబ్యునల్
 
► ఉమ్మడి రాష్ట్రంలోని నీటి కేటాయింపులనే పంచుకోవాలి
► మహారాష్ట్ర, కర్ణాటకలకు సంబంధం లేదు
► తీర్పులో 9 అంశాలకు వివరణ
► 2 రాష్ట్రాల మధ్య పంపకాలపై డిసెంబర్ 14న విచారణ
► రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టులా తీర్పు.. రెండేళ్లుగా చేస్తున్న వాదనలు గాలికి..
► మిగులు జలాలపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకం!
 
 
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల వివాదంపై అంతా అనుమానిస్తున్నట్టే జరిగింది! కృష్ణా నీళ్ల పంచాయితీని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకే పరిమితం చేస్తూ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కీలక తీర్పు వెలువరించింది. నదీ జలాలను నాలుగు రాష్ట్రాలకు కలిపి కేటాయించాలంటూ రెండేళ్లుగా తెలంగాణ చేస్తున్న వాదనలకు నీళ్లొదిలింది. ఈ తీర్పు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారనుంది. మున్ముందు మిగులు జలాలపై ఆధారపడి చేపట్టిన పాలమూరు, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎంఆర్‌పీ వంటి ప్రాజెక్టుల భవిష్యత్ ప్రశ్నార్థకం కానుంది. అంతేకాదు ఎగువ రాష్ట్రాల నుంచి ప్రాజెక్టులకు నీళ్లు రావాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిన పరిస్థితి తలెత్తనుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆశలన్నీ సుప్రీంకోర్టుపైనే పెట్టుకుంది.
 
రెండు రాష్ట్రాలే పంచుకోవాలి..
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-89 పరిధి, విస్తృతిపై జస్టిస్ బ్రిజేశ్ కుమార్ నేతృత్వంలో జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ బి.పి.దాస్ సభ్యులుగా గల ఈ ట్రిబ్యునల్ బుధవారం తీర్పు ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రానికి చేసిన కృష్ణా జలాల కేటాయింపుల నుంచే రెండు కొత్త రాష్ట్రాలు పంచుకోవాలని స్పష్టం చేసింది. సెక్షన్-89 ఇదే చెబుతోందంటూ 124 పేజీల తీర్పును వెలువరించింది. విచారణ ప్రాతిపదిక కోసం నాలుగు రాష్ట్రాల సమ్మతితో ఎంచుకున్న 9 సంశయాలకు సవివరణతో కూడిన సమాధానాలు ఇచ్చింది.

నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల వారీ కేటాయింపులు, నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల మధ్య ఆపరేషన్ ప్రొటోకాల్ (ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్లు ఇవ్వాలి) తెలంగాణ, ఏపీకే పరిమితమని ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. సెక్షన్ 89 పరిధి వివాదం పరిష్కారమైందని, కొత్త రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, ప్రాజెక్టు వారీ కేటాయింపులు, ఆపరేషన్ ప్రోటోకాల్ తేల్చేందుకు తదుపరి విచారణను డిసెంబర్ 14న చేపడతామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్ 89లోని ఏ, బీ క్లాజులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాలుగు వారాల్లో తమ అభిప్రాయాలను సమర్పించాలని సూచించింది. వాటికి జవాబులను తదుపరి రెండు వారాల్లో సమర్పించాలని, తిరిగి వాటిపై ఏవైనా ప్రతిస్పందనలు ఉంటే వారంలోగా సమర్పించాలంటూ ఉత్తర్వుల్లో తెలిపింది.
 
విడిపోవడంతో తలెత్తిన వివాదం
కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు నీటి కేటాయింపులు చేస్తూ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 2010లో కేంద్రానికి అవార్డు ఇచ్చింది. సమీక్షల అనంతరం 2013లో తదుపరి అవార్డును సమర్పించింది. అయితే ఈ కేటాయింపులతో అన్యాయం జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్ సుప్రీంలో పిటిషన్ వేసింది. దీంతో ఆ అవార్డును నోటిఫై న్యాయస్థానం చేయకుండా స్టే విధించింది. ఇదేక్రమంలో రాష్ట్రం విడిపోయింది.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో కృష్ణా నదీ నీటి కేటాయింపుల కోసం కేంద్రం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ను గడువును పొడిగించింది. ఇందుకుగాను చట్టంలో సెక్షన్ 89ను పొందుపరిచింది. అయితే ఈ సెక్షన్-89 కేవలం రెండు కొత్త రాష్ట్రాలకే కాదని, నదీ పరివాహక ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాలకూ వర్తిస్తుందని, అందువల్ల బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తిరిగి అన్ని రాష్ట్రాలకు కేటాయింపులు జరపాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాదించాయి. దీంతో ట్రిబ్యునల్ నాలుగు రాష్ట్రాల సమ్మతితో 9 అంశాలను విచారణకు ప్రాతిపదికగా తీసుకుంది.
 
9 అంశాలపై ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే..
 1. కృష్ణా నదీ జలాల కేటాయింపు వివాదాల పరిష్కారానికి కేంద్రం ఏప్రిల్ 2, 2004న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ను నియమించింది. 2010 డిసెంబర్ 13న ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించింది. రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో 2013 నవంబర్ 29న నదీ జలాల వివాద పరిష్కారాల చట్టం-1956లోని సెక్షన్ 5(3) ప్రకారం తదుపరి అవార్డు ప్రకటించింది. ఇప్పటివరకు ఈ ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటక, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు నీటి కేటాయింపులు జరిపింది. ఈ లెక్కన తుది తీర్పు వచ్చినట్టేనే?
 తీర్పు: ట్రిబ్యునల్ తదుపరి ఉత్తర్వులు ఇవ్వని పక్షంలో, కేంద్ర ప్రభుత్వం అంతర్‌రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం-1956లోని సెక్షన్ 12 పరిధిలో తదుపరి సూచనలు చేయనిపక్షంలో తుది తీర్పు వచ్చినట్టే.
 
2. నవంబర్ 29, 2013న తుది అవార్డు కేటాయించిన తర్వాత ఈ ట్రిబ్యునల్ కాలపరిధి పూర్తయ్యిందా? ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా నదీ జలాల కేటాయింపు జరపాల్సి ఉన్నందున అందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో ట్రిబ్యునల్ తిరిగి పనిచేస్తోందా?
 తీర్పు: కాల పరిమితి పూర్తవలేదు. సెక్షన్ 89 కింద కేటాయింపులు జరిపేందుకు ఈ ట్రిబ్యునల్ పనిచేస్తూనే ఉంది.

3. కేంద్ర ప్రభుత్వం 2014 మే 15న సెక్షన్ 89 ద్వారా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా నీటి విడుదలకు సంబంధించిన ఆపరేషన్ ప్రొటోకాల్‌పై చేసిన విధివిధానాలు రెండు కొత్త రాష్ట్రాల వరకే పరిమితమా?
 తీర్పు: అవును. ప్రాజెక్టు వారీ కేటాయింపులు, ఆపరేషన్ ప్రొటోకాల్ నిర్ధారణ రెండు కొత్త రాష్ట్రాల మధ్య మాత్రమే.
 
4. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం.. ట్రిబ్యునల్ విచారణ  పరిధి, విస్తృతి, విధివిధానాలు నాలుగు రాష్ట్రాలకు వర్తిస్తుందా? కేవలం రెండు కొత్త రాష్ట్రాలకే పరిమితమా?
 తీర్పు: రెండు కొత్త రాష్ట్రాలకు మాత్రమే.
 
5. 2013 నవంబర్ 29 నాటి తుది అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన జలాలనే పరిగణనలోకి తీసుకుని రెండు కొత్త రాష్ట్రాల్లో ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులు జరపాలా?
 తీర్పు: అవును. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటి నుంచే రెండు కొత్త రాష్ట్రాలకు ప్రాజెక్టు వారీగా కేటాయింపులు జరపాలి
 
6. రెండు కొత్త రాష్ట్రాల మధ్య నదీ జలాల నిర్వహణ, నియంత్రణకు ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 85(8)(ఏ), 85(8)(ఇ)... పాత అవార్డులను పక్కనపెట్టి తిరిగి కేటాయింపులు జరపడాన్ని నిషేధిస్తున్నాయా?
 తీర్పు: ఈ సెక్షన్లు అలా నిషేధించడం లేదు.. కానీ నీటి వివాద పరిష్కార ట్రిబ్యునళ్ల నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం గానీ, తిరగదోడడంగానీ వీలు కాదన్న న్యాయ సమీక్షలను బలపరుస్తున్నాయి.
 
7. 2011లో కేంద్రం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్ 5(3) కింద చేసిన సూచనలకు సమాధానంగా 2013లో ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. సెక్షన్ 89(ఎ), సెక్షన్ 89(బీ) ద్వారా తలెత్తిన ప్రశ్నలు కూడా నాటి కేంద్రం సూచనల్లాగే ఉన్నాయి. సెక్షన్ 89కు కూడా సమాధానం 2013నాటి అవార్డులో చూడొచ్చా?
 తీర్పు: ఈ అంశానికి ఇప్పుడు మనుగడ లేదు. సెక్షన్ 89ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పరిమితం చేస్తూ మొత్తం అంశాన్ని కొత్తగా చూడాలి
 
8. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నిర్ధిష్ట కేటాయింపులు జరపకుండా.. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టులకే కేటాయింపులు జరిపితే.. తక్కువ నీటి ప్రవాహం ఉన్నప్పుడు ఆపరేషన్ ప్రొటోకాల్ నిర్ధారణ సాధ్యమవుతుందా?
 తీర్పు: వాస్తవానికి ఈ అంశంపై ఎక్కువగా వాదనలు చేయలేదు. దీనికి మద్దతుగా ఎలాంటి వివరణా లేదు. అందువల్ల ఈ వాదనను నిలబెట్టడానికి మా వద్ద ఎలాంటి కారణం లేదు.
 
9. 2010 డిసెంబర్  30 నాటి అవార్డు, 2013 నవంబర్ 29 నాటి అవార్డులు నదీ జలాల వివాద చట్టం-1956లోని సెక్షన్ 6 ప్రకారం గెజిట్‌లో నోటిఫై కాలేదు. అలాగే ఈ అవార్డులపై సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. అలాంటప్పుడు ఆ రెండు అవార్డులను ‘ఫైనల్ అండ్ బైండింగ్’గా పరిగణించగలమా?
 తీర్పు: తొలి అంశాన్ని చర్చించినప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించాం. ట్రిబ్యునల్ నిర్ణయం వివాదాన్ని పరిష్కరిస్తుంది. ట్రిబ్యునల్ ఏదైనా తదుపరి ఉత్తర్వు ఇవ్వనంత  వరకు, సుప్రీంకోర్టు ఏదైనా అప్పీలుపై ఉత్తర్వు ఇవ్వనంతవరకు ట్రిబ్యునల్ నిర్ణయమే అంతిమం.

మరిన్ని వార్తలు