బ్రౌన్ సేవలను భావితరాలకు తెలియజెప్పాలి

13 Jun, 2016 02:25 IST|Sakshi
బ్రౌన్ సేవలను భావితరాలకు తెలియజెప్పాలి

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు భాషకు సీపీ బ్రౌన్ అందించిన సేవలను యువతకు, భావితరాలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. సీపీ బ్రౌన్‌కు ప్రాచుర్యం కల్పించడం ద్వారా ఆంగ్ల భాషా వ్యామోహంలో కొట్టుకుపోతున్న వారికి కనువిప్పు కలిగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

లండన్‌లోని కెన్సల్ గ్రీన్ సిమెట్రీలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరించిన సీపీ బ్రౌన్ సమాధిని కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌తో కలసి జస్టిస్ చలమేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంగ్ల భాషను అవసరం మేరకు నేర్చుకోవాలని, మాతృభాషను మాత్రం విస్మరించకూడదని సూచించారు. బ్రౌన్ సమాధికి ప్రాచుర్యం కల్పించే ప్రణాళికలు రూపొందించాలని, అవసరమైన ఆర్థిక వనరులను తాను సమకూరుస్తానని జస్టిస్ చలమేశ్వర్ హామీ ఇచ్చారు.

 

మరిన్ని వార్తలు