సినిమాలో చూపినట్టు ఆ సొరంగం నిజమే!

4 Mar, 2016 08:38 IST|Sakshi
సినిమాలో చూపినట్టు ఆ సొరంగం నిజమే!

జమ్ముకశ్మీర్: అనుకోకుండా తప్పిపోయి భారత్‌కు వచ్చిన చిన్నారి 'మున్నీ'ని తిరిగి పాకిస్థాన్ చేర్చేందుకు అష్టకష్టాలు పడతాడు బజరంగీ భాయ్‌జాన్. భద్రతా దళాల కళ్లుగప్పి సరిహద్దుల మీదుగా భారత్‌ నుంచి పాకిస్థాన్‌ వెళ్లేందుకు భారీ భూసొరంగం మార్గం ఒకటి దొరకడంతో దాని నుంచి ఎలాగోలా పాక్‌ చేరుకుంటాడు. ఇది సల్మాన్‌ ఖాన్‌ నటించిన సూపర్‌హిట్ సినిమా 'బజరంగీ భాయ్‌జాన్‌'లోని ఓ సన్నివేశం. భారత్‌-పాక్ మధ్య భూసొరంగం ఉన్నట్టు ఆ సినిమాలో చూపింది కల్పితమే కావొచ్చుకానీ, అలాంటి సొరంగం మార్గం నిజంగానే ఇరుదేశాల సరిహద్దుల కింద ఉందని తాజాగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్‌) గుర్తించింది.  పాక్‌ నుంచి జమ్ముకశ్మీర్‌ లోకి చొరబడేందుకు వీలుగా ఉన్న ఓ సొరంగాన్ని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద గురువారం కనుగొన్నారు.

జమ్ము జిల్లాలోని ఆర్‌ఎస్‌ పుర సెక్టర్‌లో అల్లా మేయి కోథాయ్‌ ప్రాంతంలో ఈ భారీ భూసొరంగాన్ని బీఎస్‌ఎఫ్‌ అధికారులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఇది 50 అడుగుల పొడవుతో ఉన్నట్టు గుర్తించారు. బీఎస్‌ఎఫ్ అధికారులు ఈ భూసొరంగం ఉన్న ప్రదేశానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి అక్రమంగా చొరబాట్లు జరిపేందుకు ఈ భూసొరంగాన్ని ఉపయోగించుకుంటున్నారా? అన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు