భారత జవాన్‌ గొంతు కోసిన పాక్‌ సైన్యం

19 Sep, 2018 19:41 IST|Sakshi

బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ గొంతు కోసి హత్య చేసిన పాక్‌ సైనికులు

జమ్మూ/న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తానీ సైనికులు దారుణానికి తెగబడ్డారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌)కు చెందిన ఓ జవానును తుపాకీతో కాల్చి, గొంతుకోసి చంపేశారు. జమ్మూ ప్రాంతంలోని రామ్‌గఢ్‌ సెక్టార్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. బీఎస్‌ఎఫ్‌ విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం.. రామ్‌గఢ్‌ సెక్టార్‌లోని సరిహద్దు కంచె వద్ద ఎత్తుగా పెరిగిన ఏనుగుల గడ్డిని కోసేందుకు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు వెళ్లారు. సరిహద్దులు స్పష్టంగా కనిపించడం కోసం ఇలాంటి అడ్డుగా ఉన్న గడ్డిని జవాన్లు కోయడం సాధారణమే.

జవాన్లు గడ్డి కోస్తుండగా పాక్‌ సైన్యం కాల్పులు జరిపింది. వెంటనే బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కూడా ప్రతికాల్పులు జరిపి చాకచక్యంగా తప్పించుకుని వచ్చారు. అయితే హెడ్‌ కానిస్టేబుల్‌ నరేంద్ర సింగ్‌ కనిపించడం లేదన్న విషయాన్ని వారు ఆలస్యంగా గుర్తించారు. దీంతో ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు ముందుగా గడ్డినంతటినీ కోసేసి తప్పిపోయిన నరేంద్ర సింగ్‌ కోసం వెతకడం ప్రారంభించారు. తమ జవాన్‌ను గుర్తించేందుకు సాయం చేయాల్సిందిగా పాకిస్తానీ సైనికులను కూడా భారత సైన్యం ఫోన్‌లో కోరింది.

కొద్ది దూరం వరకే వచ్చి జవాన్‌ను వెతికిన పాక్‌ సైనికులు, ఆ తర్వాత నీళ్లు ఉన్నాయంటూ ఆగిపోయారని బీఎస్‌ఎఫ్‌ వెల్లడించింది. 9 గంటల గాలింపు తర్వాత బుల్లెట్‌ గాయాలతో పడిఉన్న నరేంద్ర సింగ్‌ మృతదేహం కనిపించిందనీ, అతని గొంతు కూడా కోసి ఉందని తెలిపింది. ‘జవాను శరీరంలో 3 బుల్లెట్లు ఉన్నాయి. అతని గొంతు కోశారు. ఇలాంటి ఆటవిక ఘటన అంతర్జాతీయ సరిహద్దులో ఎప్పుడూ చోటుచేసుకోలేదు. దీని వెనుక పాక్‌ సైనికులున్నారు. దీనికి బీఎస్‌ఎఫ్, ఇతర దళాలు తగిన సమాధానం చెబుతాయి’ అని బీఎస్‌ఎఫ్‌ అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు