ఇసుక మీద వండేస్తున్నారు!

21 May, 2016 12:59 IST|Sakshi
ఇసుక మీద వండేస్తున్నారు!

జైసల్మీర్: వేసవిలో సాధారణంగా ఎండ నిప్పులు చెరుగుతుందని అంటుంటారు కదా..! అవునే ఆ నిప్పులనే వంట సరుకుగా వాడేసుకుంటున్నారు రాజస్థాన్ లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవానులు. ఏకంగా ఇసుక మీద రొట్టెలు వేసి కాల్చుకుని ఆరగించేస్తున్నారు. అంతేకాదండోయ్.. నీటితో ఒక తపాలాలో బియ్యాన్ని కూడా అదే ఇసుక మీద పెట్టి.. అన్నం వండేసుకోవచ్చని జవానులు చేసి చూపించారు. ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు టోపీలు, రక్షణగా ముఖానికి గుడ్డలు కట్టుకుంటున్నట్లు తెలిపారు. ఇసుక మీద బూట్లతో నడిస్తే అవి కరిగిపోతున్నాయట. ఇసుకలో నడవాల్సి వస్తే ఒంటెలను ఉపయోగిస్తున్నట్లు వివరించారు.

ఇప్పటివరకు వారి దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ పరికారలతో ఎండ వేడిమిని కొలిచి చూస్తే 55 డిగ్రీలను చూపినట్లు వివరించారు. సరిహద్దులకు దగ్గరలో ఉన్న ఫోకస్ ఎనర్జీ అనే ప్రైవేట్ కంపెనీ తమ థర్మామీటర్లు 54.5 డిగ్రీల వరకు వేడిమి ఉన్నట్లు చూపించాయని తెలిపారు. వీటిపై స్పందించిన వాతావరణ శాఖ 47.6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వివరించింది.

మరిన్ని వార్తలు