పాక్‌ పోస్టులపై బీఎస్‌ఎఫ్‌ మోర్టార్ల వర్షం

23 Jan, 2018 03:21 IST|Sakshi
పాక్‌ కాల్పుల్లో మరణించిన పౌరుడు గోపాల్‌దాస్‌ కొడుకు రోదిస్తున్న దృశ్యం

ఆర్మీ పోస్టులతోపాటు ఆయుధ డంప్‌లు ధ్వంసం

వీడియోలు విడుదల చేసిన బీఎస్‌ఎఫ్‌  

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట భారత గ్రామాలు, పోస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న పాక్‌ బలగాలకు దీటుగా జవాబిస్తున్నట్లు సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) ఉన్నతాధికారి ఒకరు సోమవారం తెలిపారు. పాక్‌ ఆర్మీ పోస్టులే లక్ష్యంగా ఇప్పటివరకూ బీఎస్‌ఎఫ్‌ 9,000 రౌండ్ల మోర్టార్‌ షెల్స్‌ను ప్రయోగించిందని వెల్లడించారు. భారత బలగాలు చాలా కచ్చితత్వంతో చేసిన దాడిలో పాక్‌ ఆర్మీకి చెందిన పలు పోస్టులు, మోర్టార్‌ లాంచింగ్‌ ప్యాడ్లు, ఆయుధాలు, ఇంధన డంప్‌లు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు.  భారత బలగాల దాడిలో పాక్‌ రేంజర్ల ఇంధన డంప్‌ ధ్వంసమవుతున్న రెండు వీడియోల్ని విడుదల చేశారు.

జమ్మూ వెంట ఉన్న 190 కి.మీల అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని తెలిపారు. జమ్మూలోని మక్వాల్‌–కనచక్‌ బోర్డర్‌ పోస్టుల మధ్య ఉన్న చికెన్‌నెక్‌ ప్రాంతంపై తొలిసారి పాక్‌ కాల్పులు జరిపిందని వెల్లడించారు. భారత బలగాల తీవ్ర ప్రతిస్పందనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్‌ రేంజర్లను పోత్సహించేందుకు ఆ దేశ సీనియర్‌ ఆర్మీ కమాండర్లు సరిహద్దుకు చేరుకోవడాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. భారత బలగాలతో చర్చలు జరిపేందుకు, ఫ్లాగ్‌ మీటింగ్‌లో పాల్గొనేందుకు పాక్‌ రేంజర్లు విముఖత చూపుతున్నారని చెప్పారు. కాల్పుల మాటున దేశంలోకి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉండటంతో అంబుష్‌ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు.

ఆగని పాక్‌ కాల్పులు
జమ్మూ, రాజౌరీ జిల్లాల్లోని మూడు సెక్టార్లపై పాకిస్తాన్‌ బలగాలు సోమవారం కూడా విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఆదివారం సాయంత్రం నుంచి మొదలైన ఈ కాల్పులు సోమవారం తెల్లవారుజాము 5.45 గంటల వరకూ కొనసాగాయని ఓ బీఎస్‌ఎఫ్‌ అధికారి తెలిపారు.

>
మరిన్ని వార్తలు