కొత్తగా పెళ్లి చేసుకున్న జవాన్ల కోసం..

9 Apr, 2018 05:04 IST|Sakshi

న్యూఢిల్లీ: కొత్తగా పెళ్లి చేసుకున్న జవాన్ల కోసం దేశవ్యాప్తంగా 190 అతిథి గృహాలను నిర్మించాలని బీఎస్‌ఎఫ్‌ (సరిహద్దు భద్రతా దళం) నిర్ణయించింది. ‘బీఎస్‌ఎఫ్‌ విధులు చాలా కఠినంగా ఉంటాయి. జవాన్లు తమ సర్వీసులో ఎక్కువ కాలం ఒంటరిగానే ఉండాల్సి వస్తోంది. వారికి ఏడాదిలో రెండున్నర నెలలు మాత్రమే కుటుంబంతో గడిపే సమయం ఉంటుంది. మొత్తంగా 30 ఏళ్లు సర్వీసులో ఉంటే.. అందులో ఐదేళ్లు మాత్రమే కుటుంబంతో ఉంటారు. ఈ నేపథ్యంలో జవాన్లు మరింత ఎక్కువ సమయం కుటుంబంతో గడిపేందుకు సదుపాయాలు కల్పిస్తున్నాం.

186 బెటాలియన్‌ లొకేషన్లతోపాటు మరికొన్ని చోట్ల అపార్ట్‌మెంట్లు నిర్మించనున్నాం. ప్రతి బెటాలియన్‌ వద్ద 15 స్టూడియో అపార్ట్‌మెంట్లు నిర్మిస్తాం’ అని బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ కేకే శర్మ వెల్లడించారు. ‘కొత్తగా పెళ్లి చేసుకున్న జవాన్లపై ఒంటరితనం ఎక్కువగా ప్రభావితం చూపుతుంది. అందుకే ఈ సదుపాయాలు కల్పించడంలో వారికే ప్రాధాన్యం ఇస్తాం. ఓ నిర్ణీత సమయం వరకు అందులో ఉండేందుకు వారికి అనుమతి ఇస్తాం’ అని వివరించారు.  తూర్పు, పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో 2,800 పైగా గదులను నిర్మించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు