మహాకూటమి ఆశలకు బీఎస్పీ చెక్‌

25 Dec, 2018 09:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలను ఏకం చేసి మహాకూటమిగా బరిలోకి దిగాలన్న కాంగ్రెస్‌ ఆశలకు బీఎస్పీ గండికొట్టింది. యూపీలో ఇప్పటికే కాంగ్రెస్‌ను దూరం చేస్తూ ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్డీలు సీట్ల సర్ధుబాటును పూర్తిచేశాయన్న వార్తలు ఆ పార్టీని నిరుత్సాహానికి లోనుచేశాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్ధానాల్లో పోటీ చేస్తుందని బీఎస్పీ ప్రకటించి కూటమి ఆశలను ఆవిరి చేసింది. మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 లోక్‌సభ స్ధానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నామని బీఎస్పీ ఉపాధ్యక్షుడు రాంజీ గౌతమ్‌ ప్రకటించారు. ఇటీవల ముగిసిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఎస్పీ వేర్వేరుగా పోటీ చేసిన క్రమంలో బీఎస్పీ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

కాగా కాంగ్రెస్‌తో ప్రీ పోల్‌ అలయన్స్‌కు తాము సుముఖంగా లేమని మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌ వంటి నేతల తీరుతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీ-కాంగ్రెస్‌ పొత్తుపై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలు నిజాయితీగా ఉన్నా స్ధానిక నేతల తీరుపై మాయావతి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆమె సహకరించారు.

బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని బీఎస్పీ నిర్ణయించిందని ప్రకటించారు. మరోవైపు ఆయా ప్రాంతాల్లో బలంగా ఉన్న పార్టీలకు ఆయా రాష్ట్రాల్లో మహాకూటమిలో భాగంగా అధిక సీట్లు కేటాయించాలని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ యాదవ్‌ తెలిపారు. ఇక మహాకూటమి తరపున రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ ప్రకటించడం సైతం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల అనంతరమే విపక్ష కూటమి ప్రధాని అభ్యర్ధిని ప్రకటిస్తామని పలు పార్టీలు వెల్లడించాయి.

కూటమి కష్టాలు ఇలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌ బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేస్తూ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీలతో ఇప్పటికే భేటీలు జరిపి ఫెడరల్‌ ఫ్రంట్‌కు ఓ రూపు, ఊపు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంమీద రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కార్‌ను ఢీ కొట్టేందుకు మహాకూటమి ఆశలు ఎంతమేరకు ఫలిస్తాయన్నది ఉత్కంఠగా మారింది.

మరిన్ని వార్తలు