'300 స్థానాల్లో మాదే విజయం'

19 Feb, 2017 09:37 IST|Sakshi
'300 స్థానాల్లో మాదే విజయం'

లక్నో: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల మూడో దశ ఓటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లక్నోలోని పోలింగ్ బూత్ నెం.251కి వచ్చిన ఆమె ఓటేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మొదటి రెండు దశల ఓటింగ్ తరహాలోనే ఈ మూడో దశ పోలింగ్ లోనూ బీఎస్పీదే హవా కొనసాగుతుందన్నారు. పూర్తి మెజార్టీతో తాము అధికారం చేపట్టడం ఖాయమని మాయావతి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ తక్కువలో తక్కువ అంటే కనీసం 300 పైగా స్థానాల్లో నెగ్గి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందని చెప్పారు.

నేడు (ఆదివారం) 69 స్థానాలకు మూడో దశ పోలింగ్ ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైంది. ఈ దశ పోలింగ్‌లో హోంమంత్రి రాజ్‌నాథ్‌ లోక్‌సభ స్థానం లక్నో, ఎస్పీకి పట్టున్న కన్నౌజ్, మైన్ పురి, ఇటావా ప్రాంతాల నియోజకవర్గాలు ఉండటంతో అందరిదృష్టి ఈ పోలింగ్ పై ఉంది. ములాయంసింగ్‌ యాదవ్‌ సొంత జిల్లా ఇటావా, ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ సతీమణి డింపుల్‌యాదవ్‌ కన్నౌజ్‌ ఎంపీ.. ఎస్పీ మరో కీలక ఎంపీ తేజ్‌ప్రతాప్‌æ యాదవ్‌ది మైన్ పురి జిల్లా కావడంతో ఈ దశ అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  ఫరూకాబాద్, హర్దోయ్, అవురైయా, కాన్పూర్‌ దేహత్, కాన్పూర్, ఉన్నావో, బరాబంకి, సీతాపూర్‌ తదితర 12 జిల్లాల్లో నేడు పోలింగ్ జరుతున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు