రక్షణకు రూ.2.95 లక్షల కోట్లు

2 Feb, 2018 05:48 IST|Sakshi

గతేడాది కంటే 7.81 శాతం పెరుగుదల

మొత్తం బడ్జెట్‌లో రక్షణకు కేటాయింపు 12.10%

పెన్షన్‌కు ప్రత్యేకంగా కేటాయింపు రూ. 1.08

న్యూఢిల్లీ: చైనా, పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అంచనాలకు తగ్గట్టుగా రక్షణ రంగానికి కేంద్రం బడ్జెట్‌లో నిధులివ్వలేదు. 2018–19 బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ. 2,95,511 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయింపులు రూ. 2.74 లక్షల కోట్ల కంటే 7.81 శాతం ఈ ఏడాది ఎక్కువ. మొత్తం బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేటాయింపులు 12.10 శాతం.. జీడీపీలో 1.58 శాతంగా రక్షణ రంగ కేటాయింపులు ఉన్నాయి. ఇక రక్షణ రంగం కేటాయింపుల మొత్తంలో ఆయుధాలు, యుద్ధవిమానాలు, యుద్ధ నౌకలు, ఇతర రక్షణ సామగ్రి కొనుగోలుకు రూ. 99,947 కోట్లు కేటాయించారు. రక్షణ బడ్జెట్‌లో సిబ్బంది జీతాలు, నిర్వహణ, ఇతరత్రా ఖర్చులకు సంబంధించి రెవెన్యూ వ్యయం రూ. 1,95,947 కోట్లుగా ఉంది. కాగా, రక్షణ రంగ సిబ్బంది పెన్షన్‌ కోసం ప్రత్యేకంగా రూ. 1,08,853 కోట్లు కేటాయించారు. ఇది గతేడాది కేటాయింపు రూ. 85,740 కోట్లు కంటే 26.60 శాతం అధికం.

కేటాయింపులు సరిపోవు
చైనా, పాకిస్తాన్‌ల సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో రక్షణ రంగాన్ని ఆధునీకరించడానికి ఈ కేటాయింపులు సరిపోవు అని నిపుణులు పేర్కొంటున్నారు. అంచనాలకు తగ్గట్టుగా బడ్జెట్‌ లేదని డిఫెన్స్‌ స్టడీస్‌ అండ్‌ అనాలిసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డా. లక్ష్మణ్‌ బెహరా చెప్పారు. ద్రవ్యోల్బణం, పరికరాల రేట్లు పెరుగుదలతో పోలిస్తే కేటాయింపులు స్వల్పమని మాజీ సైనికాధికారి ఎస్‌కే చటర్జీ చెప్పారు.

రెండు ఇండస్ట్రియల్‌ కారిడార్లు
రక్షణ రంగానికి సంబంధించి దేశీయ పరిశ్రమల ప్రోత్సాహకానికి రెండు ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ కారిడార్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ, ప్రైవేట్, ఎంఎస్‌ఎంఈ విభాగాల్లో దేశీయంగా ఆయుధ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ పాలసీ–2018ని తీసుకువస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో జైట్లీ పేర్కొన్నారు. దేశీయ రక్షణ పరికరాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రక్షణ పరికరాల పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడుల కోసం సరళీకరణ విధానాలు అవలంభిస్తున్నామని, ప్రైవేట్‌ రంగం పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. బడ్జెట్‌లో మూలధనం కేటాయింపు రూ. 3,00,441 కోట్లు అని జైట్లీ తెలిపారు. మూలధనం ఖాతాలోని మొత్తం ఖర్చులో ఇది 33.1 శాతం అని పేర్కొన్నారు.

అరుణాచల్‌ ‘సేలా’ కనుమల్లో సొరంగం
చైనా సరిహద్దుకు సమీపంలో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సేలా కనుమల్లో సొరంగం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. 13,700 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో సొరంగం పూర్తయితే... దేశ రక్షణ పరంగా వ్యూహాత్మక ప్రాంతమైన తవాంగ్‌కు వేగంగా బలగాల్ని తరలించేందుకు వీలవుతుందని ఆయన చెప్పారు. బడ్జెట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ‘ప్రతికూల వాతావరణంలోను ప్రయాణించేలా లడఖ్‌ ప్రాంతంలో రోహతంగ్‌ సొరంగం పూర్తిచేశాం. అలాగే 14 కిలోమీటర్ల జోజిలా సొరంగం కోసం పనులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు సేలా కనుమల్లో సొరంగం నిర్మాణానికి ప్రతిపాదన చేస్తున్నాం’అని వెల్లడించారు. అరుణాచల్‌ ప్రదేశలోని తవాంగ్, పశ్చిమ కామెంగ్‌ జిల్లాల మధ్య వ్యూహాత్మక ప్రాంతంలో సేలా కనుమ ఉంది.  

మరిన్ని వార్తలు