మహమ్మారి ఎఫెక్ట్‌ : చిరువ్యాపారిగా మారిన దర్శకుడు

15 Jul, 2020 20:37 IST|Sakshi

స్ర్కిప్టులకు విరామం

చెన్నై : కరోనా మహమ్మారితో అన్ని రంగాలూ కుదేలైనా సినీ పరిశ్రమపై కోవిడ్‌-19 పెనుప్రభావం చూపింది. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో సినీ కార్మికులు పూటగడవక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవకాశాలు లేకపోవడంతో మరికొందరు చిరుద్యోగాలు, చిన్న వ్యాపారాలకు మళ్లుతున్నారు. స్క్రిప్టుతో కుస్తీలు పడుతూ ఫ్లడ్‌లైట్ల హడావిడి మధ్య గడిపే ఓ దర్శకుడు కోవిడ్‌-19 విసిరిన సవాల్‌తో చిరువ్యాపారిగా మారారు. సినిమా అవకాశాలు కొరవడటంతో ఆనంద్‌ అనే దర్శకుడు కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమవడంతో తాత్కాలికంగా కిరాణా దుకాణం ఎందుకు తెరవకూడదనే ఆలోచన వచ్చిందని ఆయన చెబుతున్నారు. గత పదేళ్లుగా ఆనంద్‌ పలు చిన్న సినిమాలను తెరకెక్కించారు. పనిలేకుండా ఖాళీగా కూర్చోలేక నిత్యావసరాలకు అధిక డిమాండ్‌ ఉందనే ఆలోచనతో ఈ షాపును ప్రారంభించానని చెప్పారు.

తాను ఊహించినట్టే నిత్యావసర వస్తువులకు డిమాండ్‌ అధికంగా ఉందని, షాపుల ముందు ప్రజలు బారులుతీరి తమకు అవసరమైన వాటిని కొనుగోలు చేస్తున్నారని అన్నారు. కిరాణా దుకాణం నడపడంలో ఎలాంటి అనుభవం లేకున్నా చిన్నపాటి మొత్తంతో షాపును ఏర్పాటు చేయగలిగానని అన్నారు. తన ఇంటికి కొద్ది దూరంలోనే తన చిన్ననాటి స్నేహితుడి దుకాణాన్ని అద్దెకు తీసుకుని కిరాణా షాపు నడిపిస్తున్నానని చెప్పుకొచ్చారు. తాను తీసుకున్న నిర్ణయం సినిమా పరిశ్రమలో తన స్నేహితులు ఎవరికీ నచ్చకపోయినా కొద్దిపాటి ఆదాయం వచ్చినా తాను మరికొందరికి సాయపడగలనని ముందుకెళ్లానని గుర్తుచేసుకున్నారు. గత నెలలో తాను ఈ దుకాణాన్ని తెరిచానని, అప్పటినుంచి అంతా అనుకూలంగానే ఉందని చెప్పారు. చిన్న సినిమాలను ఓటీటీ, ఆన్‌లైన్‌ వేదికలపై విడుదల చేసే వెసులుబాటు ఉందని, త్వరలో తన దర్శకత్వంలో రూపొందిన సినిమా విడుదలవుతోందని ఆనంద్‌ వెల్లడించారు. చదవండి : క‌రోనాను జ‌యించి..101వ వ‌సంతంలోకి

>
మరిన్ని వార్తలు