ఆ దుర్మార్గుడి దారుణాలు ఒకటి కాదు.. 50

19 Aug, 2016 12:32 IST|Sakshi
ఆ దుర్మార్గుడి దారుణాలు ఒకటి కాదు.. 50

బులంద్ షహర్: బులంద్ షహర్ లైంగిక దాడి ఘటన దేశంలో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కానీ, అంతకంటే సంచలన విషయాలు ఈ ఘటనకు పాల్పడిన ప్రధాన నిందితుడి గురించి వెలుగు చూస్తున్నాయి. బులంద్ షహర్ లో లైంగిక దాడికి పాల్పడిన గ్యాంగ్ లో ప్రధాన నిందితుడు సలీం బావరియా దుష్ట చేష్టలు అంతా ఇంతా కాదు.. అది కూడా ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో అతడి దుశ్చర్యలు ఉన్నాయి.

ఇప్పటి వరకు అతడు 50 సామూహిక లైంగిక దాడులకు పాల్పడ్డాడంట. కుటుంబాలనే లక్ష్యంగా చేసుకొని అతడు ఐదు రాష్ట్రాల్లో ఈ దుర్మార్గాలకు పాల్పడ్డాడని తాజాగా పోలీసులు వెల్లడించారు. ఇది మాత్రమే కాకుండా ఎన్నో ఆకృత్యాలకు పాల్పడ్డాడని, ఎంతోమంది అమాయకులపై బందిపోటులోగా పడి దోచుకున్నాడని చెప్పారు.

రాజస్థాన్ లో గత జూన్ 30న ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని వాళ్లింట్లోని ఓ అమ్మాయిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి, చిత్ర హింసలు పెట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయిందని, మొన్న జూలైలో కూడా జాతీయ రహదారి-91పై నాలుగు దోపిడీలు చేశారని చెప్పారు. ఇదే జూలై నెలాఖరులో బులంద్ షహర్ జాతీయ రహదారిపై ఓ ఫ్యామిలీని అటకాయించి అందులోని తల్లీ కూతుళ్లపై వీరు సామూహిక లైంగికదాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు