గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాననిందితుడు అరెస్ట్..

9 Aug, 2016 09:13 IST|Sakshi
గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాననిందితుడు అరెస్ట్..

లక్నోః దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ కేసులో మరో ముగ్గురు నిందితుల్ని పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ముగ్గురిలో ప్రధాన నిందితుడు సలీం బవారియా కూడా ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ డీజీపీ జావేద్ అహ్మద్ తెలిపారు. గతవారం ఎన్ హెచ్ 91 సమీపంలో జరిగిన భయంకరమైన గ్యాంగ్ రేప్ ఘటన అనంతరం తప్పించుకున్న బవారియా సహా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

జూలై 29న ఉత్తరప్రదేశ్ నోయిడా నుంచి  షాజహాన్పూర్ కు కారులో వెడుతున్న కుటుంబాన్ని అడ్డగించి, వాహనంనుంచీ తల్లీకూతుళ్ళను బలవంతంగా బయటకు లాగి, మైనర్ బాలిక సహా తల్లిపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపింది. ఈ ఘటనతో ఉత్తరప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం ఘటనను ఖండించిన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బాధితులకు ఒక్కోరికీ మూడు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. అయితే ఈ కేసును సుమోటోగా స్వీకరించిన అలహాబాద్ హైకోర్టు..  ప్రభుత్వం కేసును సీబీఐ కి ఎందుకు అప్పగించడంలేదంటూ ప్రశ్నించింది. ఛీఫ్ జస్టిస్ డిబి భోసలే, జస్టిస్ యశ్వంత్ వర్మలతో కూడిన డివిజన్ బెంచ్.. నేరస్థుల గత చరిత్ర, సామాజిక నేపథ్యం, రాజకీయ అనుబంధాలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించింది.

ఇంతటి ఘోరం జరిగినా ప్రభుత్వం ఇంకా పాఠాలు నేర్చుకోవడం లేదని, గ్యాంగ్ రేప్ అనంతరం కూడా ఉత్తరప్రదేశ్ లో హెల్ప్ లైన్ పనిచేయకపోవడం విచారకరమని కోర్టు విమర్శించింది. మరోవైపు  హైకోర్టు లక్నో బెంచ్ కూడా పిల్ ను సీబీఐ దర్యాప్తు కోసం అప్పగించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారంలోగా తగిన సమాధానం ఇవ్వాలని కోరింది. 'వుయ్ ది పీపుల్ '  ఎన్జీవో సంస్థ జనరల్ సెక్రెటరీ ప్రిన్స్ లెనిన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు అమరేశ్వర్ ప్రతాప్ సాహి, విజయలక్ష్మి ఈ ఆదేశాలను జారీ చేశారు. అనంతరం కేసు తదుపరి విచారణను ఆగస్టు 22వ తేదీకి వాయిదా వేశారు.

>
మరిన్ని వార్తలు