బుల్లెట్ ట్రైన్ కు ట్రయిల్ రన్!

28 May, 2016 19:06 IST|Sakshi
బుల్లెట్ ట్రైన్ కు ట్రయిల్ రన్!

బరేలి : హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కల త్వరలో సాకారం కానుంది. ఇండియన్ రైల్వే అందుకోసం మరో అడుగు ముందుకేసింది. ఇజత్ నగర్, భోజీపురా స్టేషన్ల మధ్య  శనివారం స్పానిష్ కు చెందిన టాల్గో కంపెనీ హైస్పీడ్ రైలు  కోచ్ లకు  సెన్సార్ ట్రయల్ నిర్వహించింది. ట్రయల్ రన్ లో భాగంగా సూపర్ లగ్జరీ కోచ్ లను ఇండియన్ ఇంజన్ తో పట్టాలపై నడిపించినట్లు అధికారులు తెలిపారు.

బుల్లెట్ లా దూసుకుపోయే హైస్పీడ్ రైలు దేశంలో అతి త్వరలో పట్టాలెక్కనుంది. (చదవండి...మనకూ స్పానిష్ హైస్పీడ్ రైలు)  టాల్గో కంపెనీ ఈ కోచ్ లను సుమారు 30 ఏళ్ళ క్రితం తయారు చేసింది. ఇప్పటివరకూ తజకిస్తాన్ తో సహా 12 దేశాల్లో ట్రయల్ నిర్వహించి సక్సెస్ అయ్యింది. అనేక సెన్సార్ల ఆధారంగా నడిచే కోచ్ లు సరైన రీతిలో పనిచేస్తున్నాయా లేదా తెలుసుకునేందుకు రైల్వే బోర్డ్ మెకానికల్ ఇంజనీర్ సెన్సార్ ట్రయల్ నిర్వహించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.

ఆదివారం బరెలీ నుంచి మొరాదాబాద్ వరకూ ప్రారంభించే బోగీల స్పీడ్ ట్రయల్ జూన్ 12 వరకూ కొనసాగుతుందని ఈ సందర్భంగా అధికారులు  తెలిపారు. ప్రస్తుత ట్రయల్ సందర్భంలో ఈ కోచ్ లు గంటకు 115 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయని, త్వరలో న్యూఢిల్లీ ముంబై మార్గంలోని మధుర పాల్వాల్ సెక్షన్ లో జరిగే ట్రయల్ రన్ లో గంటకు 180 నుంచి 200-220 కిలోమీటర్ల వేగంతో నడిచే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.

అయితే ప్రస్తుతం నిర్వహించిన కోచెస్ సెన్సార్ ట్రయల్ విజయవంతమైందని ఈశాన్య రైల్వే ఇజత్ నగర్ డివిజన్  పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రాజేంద్ర సింగ్ తెలిపారు. బుధవారం రైల్వే బోర్డులోని ముగ్గురు సభ్యుల బృదం వర్క్ షాప్ కు చేరుకొని, టాల్గో కోచెస్ కు సంబంధించిన వివరాలను అందించిందని, అనంతరం స్పానిష్ టీమ్ దానికి సంబంధించిన ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు, కోచ్ లలోని ప్రతి వస్తువుకు చెందిన పూర్తి సమాచారాన్ని విపులంగా వివరించినట్లు రాజేంద్ర సింగ్ తెలిపారు.

మరిన్ని వార్తలు