‘సేన కూటమితో బుల్లెట్‌ ట్రైన్‌కు బ్రేక్‌’

22 Nov, 2019 15:21 IST|Sakshi

ముంబై : మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్‌, ప్రతిష్టాత్మక బుల్లెట్‌ ట్రైన్‌ పట్టాలపైకి ఎక్కడం అసాధ్యమని భావిస్తున్నారు. ముంబై-అహ్మదాబాద్‌లను కలుపుతూ తలపెట్టిన ఈ ప్రాజెక్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకునే అవకాశం ఉంది. మహారాష్ట్రలో అధికార పగ్గాలను చేపట్టిన అనంతరం శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ దేశంలో తొలి బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టును రద్దు చేస్తుందని, రూ లక్ష కోట్ల వ్యయాంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో మహారాష్ట్ర వెచ్చించాల్సిన రూ 5000 కోట్లను నిలిపివేస్తుందని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. 2017 సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబే అహ్మదాబాద్‌లో బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు కేవలం 0.1 శాతం వడ్డీతో జపాన్‌ రూ 88,000 కోట్లు రుణం ఇవ్వనుంది. ప్రాజెక్టు ముందుకు సాగాలంటే మొత్తం వ్యయం కేంద్ర ప్రభుత్వమే భరించాలి. బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుపై మహారాష్ట్ర ఖర్చు చేయబోదని ఓ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక రైతుల సంక్షేమం, వ్యవసాయ రుణాల మాఫీని నూతన ప్రభుత్వం చేపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

>
మరిన్ని వార్తలు