-

ఒంటరిగా మిగిలిన పెద్ద కుమారుడు దినేష్‌ చుంద్వాత్‌

1 Jul, 2019 10:50 IST|Sakshi

న్యూఢిల్లీ : గత ఏడాది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బురారీ ఆత్మహత్యల ఉందతాన్ని అంత సులభంగా మర్చిపోలేం. ముఢవిశ్వాసంతో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కుటుంబానికి సంబంధించి ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో ఉన్నాడు. మరణించిన నారాయణ దేవి పెద్ద కుమారుడు దినేష్‌ చుందావత్‌ మాత్రమే ప్రస్తుతం బతికి ఉన్నాడు. జరిగిన దారుణాన్ని నేటికి కూడా అతను జీర్ణించుకోలేకపోతున్నాడు.

ఈ విషయం గురించి దినేష్‌ మాట్లాడుతూ.. ‘వ్యాపార నిమిత్తం నేను మా స్వస్థలం రాజస్తాన్‌ చిత్తోర్‌గఢ్‌లో ఉంటున్నాను. జరిగిన దారుణం గురించి తెలిసి షాక్‌కు గురయ్యాను. మా కుటుంబ సభ్యులు అందరు చాలా మంచివారు. బయటి వ్యక్తులను ఎప్పుడు కనీసం ‘థూ’ అని కూడా ఎరగరు. పైగా మాది విద్యావంతుల కుటుంబం. అలాంటిది కేవలం మూఢనమ్మకంతోనే ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే నమ్మశక్యంగా లేదు. పోలీసుల విచరణ పట్ల నేను సంతృప్తిగా లేను. కానీ ప్రస్తుతం నేను ఒంటరిగా మిగిలాను.. పోరాడే ఓపిక లేదు’ అన్నాడు. (చదవండి : 11 మంది మరణం: అతడే సూత్రధారి)

అంతేకాక ‘మా కుటంబంలో జరిగిన విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. తాంత్రిక శక్తులంటూ ఏవేవో పుకార్లు వ్యాపించాయి. ప్రస్తుతం మా ఇంటికి సంబంధించి కూడా ఇలాంటి వార్తలే ప్రచారం చేస్తున్నారు. మా ఇంటిని తక్కువ రేటుకు కొట్టేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నార’ని దినేష్‌ ఆరోపించాడు. ఇంతమంది మృతికి నారాయణ దేవి(77) చిన్న కుమారుడు లలిత్‌ భాటియా(45)నే కారణం. అతడు మరణించిన తండ్రి తనకు కనిపిస్తున్నాడని, తనతో మాట్లాడుతున్నాడని.. తనకు సందేశాలు ఇస్తున్నాడని కుటుంబ సభ్యులకు చెప్పేవాడు. ఈ క్రమంలోనే తండ్రి సందేశాలను రిజిస్టర్‌లో రాసి మిగతా కుటుంబ సభ్యులకు తెలిపేవాడు.

అందులో భాగంగానే రిజిస్టర్‌లో ఒక చోట ‘త్వరలోనే మీ ఆఖరి కోరికలు నెరవేరతాయి. అప్పుడు ఆకాశం తెరుచుకుంటుంది. భూమి కంపిస్తుంది. కానీ ఎవరూ భయపడకండి. గట్టిగా మంత్రాన్ని జపించండి నేను మిమ్మల్ని కాపాడతాను’ అని తండ్రి తనతో చెప్పినట్లు కాగితంలో రాసి కుటుంబ సభ్యులకు తెలిపాడు. లలిత్‌ భాటియా చెప్పిన విషయాలను మిగతా కుటుంబ సభ్యులు కూడా నమ్మి అతడు చెప్పినట్లే ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారు పోలీసులు.

మరిన్ని వార్తలు