బురారీ కేసు: ఇంటిని ఆలయంగా మార్చండి!

6 Jul, 2018 15:20 IST|Sakshi

స్థానికుల డిమాండ్‌

ఈ ఘటనతో భయాందోళనలో స్థానికులు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బురారీ ఆత్మహత్యల కేసు విషయంలో స్థానికులు ఓ కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. గత ఆదివారం 11 మంది మూకమ్మడిగా బలవన్మరణానికి పాల్పడటంతో స్థానికులు భయంతో చచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆ చుట్టుపక్కల్లో నివసించే చాలా మంది ఇతర ప్రదేశాలకు తరలి వెళ్లారు. ప్రస్తుతం ఆ ఇంటిని పోలీసులు సీజ్‌ చేశారు. మరి దర్యాప్తు తర్వాత ఆ ఇంటిని ఎవరికి అప్పగిస్తారు అన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఆ ఇంటిని తీసుకోడానికి బంధువులు సైతం విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇంటిని ఏం చేయాలనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఘటనతో ఆ ఇంటిని కొనుగోలు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రారని, ఆ ఇంటిని దేవాలయంగా మార్చడమే ఉత్తమమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

మరోవైపు దీనిపై మృతుల బంధువు కేతన్‌ నాగ్‌పాల్‌ స్పందిస్తూ.. ఇంటి గురించి ఇంకా ఏలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ విషయంపై బంధువులతో చర్చించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని, పోలీసులు ఆధీనంలో ఉన్న ఇంటిని ఎప్పుడు అప్పజెప్పుతారనే విషయం తెలియదన్నారు. మృతురాలు నారాయణ్‌ దేవి మరో కుమార్తె, కుమారుడు పానిపట్‌, ఛిత్తోర్‌గఢ్‌లో స్థిరపడ్డారు. దీంతో వారు ఈ ఇంటిని తీసుకోడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. నవీన్‌ బాత్రా అనే స్థానికుడు మాట్లాడుతూ.. తన 21 ఏళ్ల కూతురు ఈ ఘటన అనంతరం భయంతో వణికిపోతుందని, లైట్‌ లేనిది ఇంట్లో ఉండలేక పోతుందని, చివరకు వాష్‌ రూం డోర్‌ పెట్టుకోడానికి కూడా భయపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆ ఇంటికి పోలీసులు వస్తుండటం, టీవీ చానెళ్లో పదే పదే రావడం కూడా స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తోంది.

చిన్నారులను బలవంతంగా చంపారు!
ఇక ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెల్లడవుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజీలో చిన్నారులను ఆత్మహత్య చేసుకునేలే వారిపై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. 15 ఏళ్ల ధృవ్‌, శివమ్‌లిద్దరికి బలవంతంగా ఊరితాడు బిగించారని దీంతోనే వారి శరీరాలపై  గాయాలైనట్లు పోలీసులు వాపోతున్నారు. ఈ ఫుటేజీలో ఆ 11 మంది స్టూల్స్‌, వైర్ల పట్టుకెళ్లినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు