69 ఏళ్ళ తర్వాత బస్సొచ్చింది!

27 Jun, 2016 17:40 IST|Sakshi
69 ఏళ్ళ తర్వాత బస్సొచ్చింది!

ఉత్తరాఖండ్ః స్వతంత్రం వచ్చి ఆరవై ఏళ్ళు దాటిపోయినా ఇప్పటివరకూ ఆ గ్రామానికి రోడ్డు మార్గమే లేదు. ఊళ్ళోకి చేరాలంటే కొండలు గుట్లలు ఎక్కి వెళ్ళాల్సిందే. అక్కడ పుట్టి పెరిగి ముసలివారు కూడ అయిపోయిన వారు ఉన్నారేకానీ.. వారు ఒక్కసారైనా  బస్సు ఎక్కేందుకే నోచుకోలేదట. అయితే వారి సుదీర్ఘ నిరీక్షణకు ఇప్పుడు తెరపడింది. 69 ఏళ్ళ తర్వాత ఆ  గ్రామానికి బస్సొచ్చింది.

ఉత్తరాఖండ్ మారుమూల గ్రామమైన సిల్పదా ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. ఏళ్ళ తరబడి చూసిన ఎదురు చూపులు ఫలించి గ్రామంలోకి 69 ఏళ్ళ తర్వాత బస్సు రావడంతో ఆనందంలో మునిగితేలుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన  ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంతో అక్కడి వారి కలలు నెరవేరాయి. పథకంలో భాగంగా  గ్రామానికి రోడ్డు మార్గం వేయడంతో బస్సులు కూడ వచ్చే అవకాశం ఏర్పడింది. జిల్లా కేంద్రమైన చమోలీ, సిల్పదా గ్రామాలు దగ్గర్లోనే ఉన్నా... సిల్పదాకు ఇప్పటివరకూ రోడ్డు మార్గం లేకపోవడంతో బస్సు వచ్చే అవకాశమే లేకుండా పోయింది. దాంతో 69 ఏళ్ళ పాటు అక్కడి ప్రజలు ఎదురు చూపులతోనే కాలం వెళ్ళదీయాల్పి వచ్చింది. ఎన్నోసార్లు గ్రామప్రజలు పలు ప్రభుత్వాలకు అర్జీలు పెట్టినా ఫలితం లేకపోయింది. తమ గ్రామానికి రోడ్డుమార్గం, బస్సు సౌకర్యం కల్పించాలంటూ అనేకసార్లు ఆందోళనలు కూడ నిర్వహించిన దాఖలాలు లేకపోలేదు.

ఇటీవలే సిల్పదా గ్రామంలో కేంద్ర ప్రభుత్వం  రోడ్డు నిర్మాణం చేపట్టి అక్కడ సమకూరిన నిధులతో విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో తొలిసారి గ్రామంలోకి  బస్సు వస్తుండటంతో స్థానికంగా పండుగ వాతావరణం కనిపించింది.  పట్టలేని ఆనందంలో ఉన్నప్రజలు సంప్రదాయ నృత్యాలు, ఆటపాటలతో ఆనందంలో తేలియాడుతున్నారు. 

>
మరిన్ని వార్తలు