కూర‌గాయ‌ల వ్యాపారి బంప‌ర్ ఆఫ‌ర్‌: పేద‌ల‌కు మాత్ర‌మే

28 May, 2020 15:09 IST|Sakshi

ఔరంగాబాద్‌: కొండంత చేసినా, గోరంత చేసినా సాయం విలువ మార‌దు. క‌రోనా విప‌త్తు వ‌ల్ల‌ పూట గ‌డ‌వట‌మే క‌ష్టంగా మారిన నిరుపేద‌ల గురించి ఆలోచించిన ఓ కూర‌గాయల వ్యాపారి సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. ఉచితంగా కూర‌గాయ‌లు అందిస్తూ అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో చోటు చేసుకుంది. ఔరంగాబాద్‌కు ఎందిన రాహుల్ లాబ్డే ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. లాక్‌డౌన్ వ‌ల్ల కంపెనీ జీతాలివ్వ‌డం మానేసింది. దీంతో అత‌ను త‌న తండ్రితో క‌లిసి కూర‌గాయాల వ్యాపారం చేస్తున్నాడు. ఓ రోజు అత‌ని బండి ద‌గ్గ‌ర‌కు ఓ వృద్ధురాలు వ‌చ్చి రూ.5కు కూర‌గాయ‌లివ్వ‌మ‌ని అడిగింది. (ఆవు అంత్య‌క్రియ‌లు: గుంపులుగా జ‌నం)

దీంతో విస్తుపోయిన లాబ్డే ఆమె దీన స్థితిని అర్థం చేసుకుని ఉచితంగా కూర‌గాయలిచ్చాడు. ఆ క్ష‌ణ‌మే అత‌నిలో నిరుపేద‌ల‌కు సాయం చేయాలన్న ఆలోచ‌న మ‌న‌సులో బ‌లంగా నాటుకుంది. వెంట‌నే త‌న కూర‌గాయల బండికి ఒక బోర్డు త‌గిలించాడు. అందులో "వీలైతే కొనండి, లేదంటే ఉచితంగా తీసుకోండి" అని రాసి ఉంది. దీన్ని గ‌మ‌నించిన జ‌నం కొంద‌రు విడ్డూరంగా చూడ‌గా మ‌రికొంద‌రు మాత్రం అత‌ని నిర్ణ‌యాన్ని మెచ్చుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు రూ.2 వేలు విలువ చేసే కూర‌గాయల‌ను ఉచితంగా ఇచ్చాడు. దీని గురించి లాబ్డే మాట్లాడుతూ.. 'రోజు ముగిసే స‌రికి ఆక‌లితో ఎవరూ నిద్రించ‌వ‌ద్ద‌'న్న‌దే త‌న కోరిక అని చెప్తూ మంచి మ‌న‌సును చాటుకున్నాడు. (‘ఈ ఫోటోలకు అరెస్ట్‌ కాదు.. అవార్డు ఇవ్వాలి’)

మరిన్ని వార్తలు