అస్సాంలో హంగ్.. కేరళలో ఎల్డీఎఫ్

2 Apr, 2016 08:18 IST|Sakshi
అస్సాంలో హంగ్.. కేరళలో ఎల్డీఎఫ్

♦ బెంగాల్, తమిళనాడులో అధికార పార్టీలకే అందలం
♦ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సీ-వోటర్ సర్వే
 
 న్యూఢిల్లీ: బీజేపీ, కాంగ్రెస్‌కు కీలకంగా మారిన అస్సాంలో హంగ్ తప్పదని ఇండియాటీవీ-సీ ఓటర్ సర్వే స్పష్టం చేసింది. ఏప్రిల్ 4న తొలి విడత ఎన్నిక జరగనున్న అస్సాంలో బీజేపీ గణనీయంగా పుంజుకునే పరిస్థితులున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు 9 సీట్ల దూరంలో కమలానికి బ్రేక్ తప్పదని వెల్లడించింది. అస్సాంతోపాటు మిగిలిన మూడు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో పరిస్థితులపైనా సర్వే నిర్వహించింది. కేరళలో విపక్ష లెఫ్ట్ కూటమి ఎల్డీఎఫ్ స్పష్టమైన మెజారిటీతో అధికారం చేజిక్కించుకోనుండగా.. పశ్చిమబెంగాల్, తమిళనాడులో అధికార పార్టీనే ప్రజలు అందలమెక్కించనున్నట్లు పేర్కొంది. మార్చి చివర్లో సీ-ఓటర్ ఈ సర్వే నిర్వహించినట్లు ఇండియాటీవీ తెలిపింది.

 అస్సాంలో నువ్వా నేనా?
 ఈశాన్య రాష్ట్రాల్లో తొలి అడుగు వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ కూటమి.. 126 సీట్లున్న అస్సాం అసెంబ్లీలో 55 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినా.. అధికారం చేజిక్కించుకోవటం కష్టమని సర్వేలో తేలింది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తరుణ్ గొగోయ్ నేతృత్వంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ 53 స్థానాల్లో గెలవనుంది. ప్రస్తుత అసెంబ్లీలో 18 స్థానాలున్న ఆలిండియా యునెటైడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ 12 సీట్లతో సరిపెట్టుకోనుందని, మొత్తంమీద అస్సాంలో హంగ్ తప్పదని తెలిపింది.

 కేరళలో ఎర్రజెండా!
 కేరళలో ఐదేళ్లుగా విపక్షంలోఉన్నలెఫ్ట్ కూటమి భారీ మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకోనుందని సర్వే తెలిపింది. 140 సీట్లున్న అసెంబ్లీలో ఎల్డీఎఫ్ 86 సీట్లు గెలుచుకుంటుందంది. అధికార యూడీఎఫ్ 53 సీట్లు గెలుచుకోనుంది. బీజేపీ బోణి చేసినా ఒక సీటుకే పరిమితమవుతుందని సర్వే పేర్కొంది.

 దీదీకే బెంగాల్ పట్టం
 294 సీట్లున్న పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసిన మమత 184 సీట్లు గెలుచుకోగా.. ఈసారి 20 స్థానాలు తగ్గనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌తో కలసి పోటీ చేస్తున్న వామపక్ష పార్టీలు 106 సీట్లు గెలుచుకుంటాయని సర్వే తెలిపింది. 42 సీట్లున్న కాంగ్రెస్ ఈ సారి 21 సీట్లకే పరిమితం కానుంది.

 తమిళుల ఓటు అమ్మకే!
 తమిళనాడులో 234 సీట్లకు గాను జయలలిత 130 స్థానాల్లో గెలుపొందనుండగా.. డీఎంకే-కాంగ్రెస్ కూటమికి 70 సీట్ల వరకు వస్తాయని సర్వేలో వెల్లడైంది. విజయ్‌కాంత్ నేతృత్వంలోని మూడో కూటమి (వామపక్ష పార్టీలతో కలిపి) తో పాటు ఇతరులు 34 సీట్లు గెలిచే అవకాశాలున్నాయి. ఏఐఏడీఎంకే ఒంటరిగా బరిలో దిగగా, చిన్నాచితకా పార్టీలతో కలసి బరిలో దిగిన బీజేపీకి ఒక్క సీటు కూడా గెలిచే అవకాశాలు కనిపించటం లేదని.. సర్వే తెలిపింది.

>
మరిన్ని వార్తలు