సీఏఏ అమలుకు ‘ఆన్‌లైన్‌’!

1 Jan, 2020 04:54 IST|Sakshi

ఆన్‌లైన్‌లోనే అమలు ప్రక్రియను చేపట్టాలనుకుంటున్న కేంద్రం

రాష్ట్రాల జోక్యాన్ని నివారించేందుకేఅంటున్న హోంశాఖ వర్గాలు

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) అమలు చేసేందుకు పలు రాష్ట్రాలు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్న నేపథ్యంలో.. ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. రాష్ట్రాలతో సంబంధం లేకుండా, ప్రత్యేక అథారిటీ పర్యవేక్షణలో మొత్తం ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియను ముగించే అవకాశాలపై సమాలోచనలు చేస్తోంది. ప్రస్తుతమున్న పౌరసత్వ విధానం ప్రకారం.. దరఖాస్తులను ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించి, నిర్ణయం తీసుకుంటారు.

ఆ విధానాన్ని తొలగించి, మొత్తం ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియ జరిపేందుకు కేంద్ర హోం శాఖ ఆలోచిస్తోంది. ‘ఒక కొత్త అథారిటీని ఏర్పాటు చేసి.. ఆ అథారిటీ ఆధ్వర్యంలో దరఖాస్తు స్వీకరణ నుంచి, డాక్యుమెంట్ల పరిశీలన, పౌరసత్వ జారీ వరకు మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లో జరిపే విషయంపై ఆలోచిస్తున్నాం’ అని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌ అయితే, ఏ స్థాయిలో కూడా రాష్ట్రాలు జోక్యం చేసుకునేందుకు వీలుండదు. మరోవైపు, సీఏఏ అమలును రాష్ట్రాలు తిరస్కరించలేవని, ఆ అధికారం వాటికి లేదని హోంశాఖ వర్గాలు చెప్పాయి.

అస్సాం టూరిజంకు భారీ నష్టం 
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అస్సాంలో జరిగిన ఆందోళనల కారణంగా రాష్ట్ర పర్యాటక రంగానికి డిసెంబర్‌లో రూ. 500 కోట్ల నష్టం వాటిల్లింది. జనవరిలో మరో రూ. 500 కోట్లు నష్టపోయే అవకాశముందని అస్సాం టూరిజం తెలిపింది. రాష్ట్రంలో పర్యాటక రంగం ద్వారా ప్రత్యక్షంగా  50 వేల మంది, పరోక్షంగా లక్ష మంది ఉపాధి పొందుతున్నారని అధికారులు తెలిపారు.

అస్సాం సాంస్కృతిక యోధుడు ఓఝా మృతి 
సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్న అస్సాం సాంస్కృతిక, నాటక రంగ ప్రముఖుడు ఒయినింటమ్‌ ఓఝా(88) మంగళవారం కన్నుమూశారు. మూడు రోజుల క్రితం వరకు కూడా సీఏఏ వ్యతిరేక నిరసనల్లో ఆయన పాల్గొన్నారు.

సరిహద్దు బంగ్లా గ్రామాల్లో మొబైల్‌ బంద్‌
భారత్‌ సరిహద్దుల్లో ఉన్న బంగ్లాదేశ్‌లోని గ్రామాల్లో మొబైల్‌ నెట్‌వర్క్‌ సేవలను నిలిపివేయాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సోమవారం నుంచి సరిహద్దుల్లో ఒక కిలోమీటరు పరిధిలో మొబైల్‌ నెట్‌వర్క్‌ సేవలను నిలిపివేసినట్లు దేశ సర్వీస్‌ ప్రొవైడర్లు గ్రామీణ్‌ఫోన్, టెలిటాక్, రోబి, బంగ్లాలింక్‌ సంస్థలు వెల్లడించాయి.

అన్ని రాష్ట్రాలూ అమలు చేయాల్సిందే 
పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగబద్ధమైనదేనని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. దేశమంతా, అన్ని రాష్ట్రాలు ఆ చట్టాన్ని అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. సీఏఏను ఉపసంహరించాలని  కేరళ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని అమోదించిన నేపథ్యంలో ప్రసాద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో ఉన్న అంశాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుంది. పౌరసత్వానికి సంబంధించిన చట్టాలను పార్లమెంటే చేయాలి. అసెంబ్లీలు కాదు. ఆ చట్టాలు దేశమంతా అమలు జరగాలి’ అని స్పష్టం చేశారు. కేరళ అసెంబ్లీ తీర్మానంపై స్పందిస్తూ.. తీర్మానం చేసే ముందు, సీఎం విజయన్‌ న్యాయ నిపుణులను సంప్రదిస్తే బావుండేదని వ్యాఖ్యానించారు. సీఏఏ భారతీయులకు కానీ, భారతీయ ముస్లింలకు కానీ సంబంధించిన విషయం కాదన్నారు.

మరిన్ని వార్తలు