సీఏఏ : నార్వే టూరిస్టును వెళ్లగొట్టారు!

27 Dec, 2019 12:24 IST|Sakshi

త్రివేండ్రం : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు గాను నార్వే టూరిస్టును అధికారులు దేశం నుంచి పంపించేశారు. వివరాలు.. నార్వే దేశానికి చెందిన మాజీ నర్సు జాన్నె మెట్టె జాన్సన్‌ (74) డిసెంబర్‌ 17న భారతదేశ సందర్శనకు వచ్చింది. ఈ క్రమంలో 23వ తేదీన కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ఉండగా, అక్కడ స్థానికులు సీఏఏకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తుండడంతో జాన్సన్‌ కూడా పాల్గొంది. అనంతరం నిరసనలో తన అనుభవాల గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ఈ విషయాన్ని గమనించిన అధికారులు ఆమె ఫేస్‌బుక్‌ ఖాతాను తనిఖీ చేయగా, అందులో అరుంధతీరాయ్‌ చేసిన వ్యాఖ్యలను షేర్‌ చేయడంతో పాటు సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా ఉన్న కామెంట్లను గుర్తించారు.

ఈ నేపథ్యంలో వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను వెంటనే దేశం విడిచి వెళ్లాలంటూ అధికారులు జాన్సన్‌కు ఆదేశాలు  జారీ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై  జాన్సన్‌ను సంప్రదించగా, అధికారులు చెప్పేదంతా నిజమేనని ఒప్పుకుంది. అయితే దేశం నుంచి వెళ్లిపోవడానికి తాను సిద్ధపడినా, అధికారులు మాత్రం విమాన టిక్కెట్‌ బుక్‌ చేసేదాకా వదలలేదని, వారికి విమాన టిక్కెట్టు చూపించిన తర్వాతే శాంతించారని పేర్కొంది. కాగా, కొన్ని రోజుల ముందు మద్రాస్‌ ఐఐటీలో ఓ జర్మన్‌ విద్యార్థి కూడా నిరసనల్లో పాల్గొన్నందుకు అధికారుల ఆదేశాల మేరకు దేశం విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. చదవండిదేశం విడిచి వెళ్లాలంటూ జర్మన్‌ విద్యార్థికి ఆదేశం

మరిన్ని వార్తలు